ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఆ ఎంపీ నియోజకవర్గం. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఆ తర్వాత రెబల్ మారారు. ఇక తొలుత బీజేపీ తర్వాత టీడీపీ తరపున టికెట్ ఆశీంచిన నిరాశే ఎదురైంది. పొత్తులో భాగంగా ఈసారి నరసాపురం నుండి బీజేపీ పోటీ చేస్తోంది. భూపతిరాజు శ్రీనివాసవర్మ బరిలో ఉండగా టీడీపీలో చేరిన రఘురామ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక వైసీపీ తరపున బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత ఉమాబాల బరిలో ఉన్నారు. ఇక కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి ఇద్దరు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో ఆచంట, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉండి, నరసాపురం నియోజకవర్గాలు ఉండగా క్షత్రియులు, కాపు సామాజికవర్గం డామినేషన్ ఎక్కువ. ఉండి, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా క్షత్రియులు, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
నరసాపురం పార్లమెంటు పరిధిలో 13 లక్షల ఓటర్లు ఉండగా 2019లో 11 లక్షల 74 వేల 441 ఓట్లు పోలయ్యాయ. వైసీపీకి 4 లక్షల 47 వేల 594 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శివరామరాజుకు 4 లక్షల 15 వేల 685 ఓట్లు,నాగబాబుకు రెండు లక్షల 50 వేల 259 ఓట్లు వచ్చాయి. సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రభుత్వ, సంక్షేమ పథకాలతో తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఉమాబాల. బీసీ అభ్యర్థిని అయిన తనను ప్రజలు ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేస్తుండగా టీడీపీ – జనసేనపై ఆధారపడి పోటీ చేస్తున్న బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.
