Thursday, May 8, 2025
- Advertisement -

‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ సాధ్యమయ్యేనా!

- Advertisement -

ప్రస్తుతం దేశంలో జమిలి ఎన్నికల గురించే చర్చ జరుగుతోంది. ఆర్ఎస్‌ఎస్‌ ఎజెండా అమలులో భాగంగా ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. జమిలి ఎన్నికల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటనే దానిని ప్రజలకు వివరించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఒకే దేశం ఒకే ఎన్నికలను తీవ్రంగా తప్పుబడుతున్నాయి విపక్షాలు.

ఐదు రాష్ట్రాలకు త్వరలో అంటే డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు వీలైతే 2024లో జరగాల్సిన లోక్ సభ ఎన్నికలను ఈ ఏడాది చివర్లోనే జరిపే విధంగా మోడి సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని రాజకీయ వర్గాల సమాచారం.

అయితే దేశ వ్యాప్తంగా అటు అసెంబ్లీ ఎన్నికలను ఇటు లోక్ సభ ఎన్నికలను ఒకే సారి నిర్వహించడం అంతా తేలికైన విషయం కాదు. ఎందుకంటే అనేక పీటముడులు ఈ సమస్య చుట్టు ఉన్నాయి. రాజ్యాంగంలో పార్లమెంట్ పదవి కాలాన్ని సూచించే ఆర్టికల్ 83, అలాగే రాష్ట్రపతి పాలనను సూచించే 85, రాష్ట్రాల అసెంబ్లీ పదవి కాలాన్ని సూచించే ఆర్టికల్ 172, 174 వంటి చట్టాలను సవరించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే సాధ్యమయ్యే పనికాదు. ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళితే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఒకవేళ ఒప్పుకున్న మిగితా రాష్ట్రాల నుండి ఖచ్చితంగా వ్యతిరేకత రావడం ఖాయం. ఇప్పటికే మోడీ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దీనిని మరింత పెద్దది చేసుకునేందుకు ఆ పార్టీ ఇష్టపడుతుందా అంటే అది అంతుచిక్కని ప్రశ్నే. ఒకవేళ ఈ సమస్యలన్నీ దాటుకొని జమిలి ఎన్నికలు నిర్వహించిన.. ఆ తరువాత ఏదో ఒక రాష్ట్రంలో అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం రాద్దైతే.. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనేది అతిపెద్ద సవాల్. దీనిపై ఇప్పటికే పలు పార్టీలు బహిరంగంగానే మోడీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి.

వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తేమీ కాదు. 1952లో తొలి ఎన్నికలు మొదలుకొని 1957,1962,1967 వరకు లోక్ సభకు,రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల అసెంబ్లీలను బర్తరఫ్ చేయడంతో జమిలీ ఎన్నికలు కనుమరుగైపోయాయి. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. అయితే రాష్ట్రంలో రాజ్యాంగబద్ద యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్‌ని కేంద్రం ఉపయోగించాలి కానీ ఇందుకు విరుద్దంగా ఉపయోగిస్తే అది రాజ్యాంగ విరుద్దమే అవుతుంది. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో రాజ్యాంగ నిబంధనలకు లోబడి జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చట్టసభ కాలవ్యవధిని సరైన కారణాలతో సవరించాల్సి ఉంటుంది.

ఇక ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు కనీసం 67 శాతం ఓట్లతో అమోదించాల్సి ఉంటుంది. అలాగే ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు అమోదముద్రవేయాలి. లోక్‌సభలో ఎన్డీయే బలం 61 %, జమిలి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం 67 %. రాజ్యసభలో ఎన్డీయే బలం ..38 %, జమిలి బిల్లు ఆమోదానికి కావాల్సిన బలం 67 %,ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలు.. 16,బిల్లు ఆమోదానికి 14 రాష్ట్రాల అమోదం అవసరం.అయితే బీజేపీ మిత్ర పక్షాలు సైతం దీనిని అంగీకరించే పరిస్థితి లేదు. సో ఒకే దేశం ఒకే ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -