తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. దేశ రాజకీయాలను ఎప్పుడూ ఆకర్షిస్తుంటాయి. ఇక ప్రస్తుతం స్టాలిన్ నేతృత్వంలోనే డీఎంకే అధికారంలో ఉండగా ప్రతిపక్ష పార్టీగా అన్నాడీఎంకే ఉంది. ఇక వీటితో పాటు చాలా మంది నటులకు చెందిన రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి.ఇటీవలె నటుడు, ఇళయ దళపతి విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
తమిళ వెట్రిక కళగం పార్టీని స్థాపించిన తొలి మహానాడును సైతం విజయవంతంగా నిర్వహించారు విజయ్. ఇక ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అద్భుత స్పందన రాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు విజయ్.
ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశాంత్‌కిశోర్‌తో రెండు గంటలకు పైగా సమావేశం అయ్యారు విజయ్. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పీకే టీం.. విజయ్‌తో కలిసి పనిచేస్తాయా అన్న రూమర్స్ తమిళనాట మొదలయ్యాయి.
దేశంలోని అగ్రశ్రేణి ఎన్నికల వ్యూహకర్తల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నారు ప్రశాంత్ కిషోర్. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ, 2021 తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే విజయంలో కీలకపాత్ర పోషించారు. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీకేతో బేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రశాంత్ కిషోర్ 2023లో జన్ సురాజ్ పార్టీను స్థాపించగా ఈ ఏడాది చివరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.