పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను తొలుత ‘భవదీయుడు భగత్ సింగ్’ అని ప్రకటించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తరువాత స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, ఇప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.
ఇటీవల ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ ఈ మార్పుల వెనుక కారణాన్ని వివరించారు. గబ్బర్ సింగ్‌లో పవన్ ఎక్కువ భాగం పోలీస్ యూనిఫామ్‌లో కనిపించారు. ఈసారి కొత్తదనం కోసం కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో కథను ప్రారంభించాను. కానీ అభిమానులు మళ్లీ ‘గబ్బర్ సింగ్’ తరహా మాస్ ఎంటర్‌టైనర్‌ను ఆశించారు అని చెప్పారు.
సోషల్ మీడియా ప్రభావం మనపై ఉంటుంది. జెన్ జెడ్ ప్రేక్షకులు ‘భవదీయుడు’ అంటే ఏమిటని అడిగారు. టైటిల్ అర్థం కాకపోతే ఎలా ఉత్సాహం కలుగుతుంది? పవన్ గారికి ఆ టైటిల్ నచ్చింది. కానీ అభిమానులు మాస్ ఎలిమెంట్స్ కోరుకున్నారు. అవి మొదటి కథలో సరిగా సరిపోలలేదు. అందుకే బలమైన క్యారెక్టరైజేషన్ అవసరమని భావించాను. అలా ‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మారింది అని తెలిపారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
