తమిళనాడులో నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలోని సిన్గంపునారి సమీపంలో జరిగిన జల్లికట్టు సందర్భంగా ఎద్దులు అదుపుతప్పి ప్రేక్షకులపైకి దూసుకెళ్లాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, 76 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సాంప్రదాయంగా సంక్రాంతి వేడుకల సందర్భంగా నిర్వహించే జల్లికట్టు పోటీలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పోటీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కొన్ని ఎద్దులు నియంత్రణ కోల్పోయి ప్రేక్షకుల వైపు పరుగులు తీశాయి. అక్కడ ఉన్న యువకులు, ప్రేక్షకులు ఎద్దులను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు.
గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా ఏర్పాట్లలో లోపాలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. జల్లికట్టు వంటి సాంప్రదాయ క్రీడల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
