బాలీవుడ్ నటి కృతి సనన్ సోదరి, నటి అయిన నుపూర్ సనన్ పెళ్లి వార్తలు గత కొన్ని రోజులుగా బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ ఊహాగానాలకు తెరదిస్తూ, నుపూర్ తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆమె దీర్ఘకాల ప్రియుడు, ప్రముఖ గాయకుడు స్టెబిన్ బెన్కు ‘అవును’ చెప్పింది. ఈ విషయాన్ని నుపూర్ స్వయంగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ వెల్లడించింది.
నుపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోల్లో, మోకాళ్లపై కూర్చుని స్టెబిన్ బెన్ ప్రపోజ్ చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. అతని వెనుక “Will You Marry Me” అని రాసి ఉండటం ఆకట్టుకుంది. మరో ఫోటోలో నుపూర్ తన డైమండ్ ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను గర్వంగా ప్రదర్శిస్తూ కనిపించింది. అలాగే, కృతి సనన్ తన సోదరి, కాబోయే బావ స్టెబిన్‌ను ఆప్యాయంగా హగ్ చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. మరో ఫోటోలో ఈ జంట వీడియో కాల్ ద్వారా సనన్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు కనిపించింది.
ఈ ఫోటోలతో పాటు నుపూర్…అనిశ్చితులతో నిండిన ఈ ప్రపంచంలో, నేను ఎంతో సులభంగా చెప్పగలిగిన ‘YES’ దొరికింది” అంటూ భావోద్వేగ క్యాప్షన్ రాసింది.
ఈ నిశ్చితార్థం ముంబైలోని ఓ యాచ్‌పై జరిగినట్లు సమాచారం. ఈ ప్రత్యేక సందర్భంగా నుపూర్ ఫ్లోరల్ డ్రెస్‌లో మెరిసిపోగా, స్టెబిన్ బెన్ బ్లూ సూట్‌లో కనిపించాడు.
ఇప్పటికే నుపూర్–స్టెబిన్ పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్నాయి. జనవరి 11న ఉదయ్‌పూర్‌లో వివాహం జరగొచ్చని బీటౌన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది సన్నిహితుల మధ్యే జరిగే ప్రైవేట్ వేడుకగా ఉండగా, అనంతరం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు కుటుంబం గానీ, జంట గానీ అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఈ ప్రపోజల్‌తో పెళ్లి ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.
