తెలంగాణ నేల తనకు అపారమైన ధైర్యం, చైతన్యం ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఈ రాష్ట్రం నుంచి ఏమీ ఆశించడం లేదని, కేవలం తెలంగాణ ప్రజల మంచి కోసం తన వంతు కృషి చేయాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు. కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున ధైర్యంగా పోటీ చేసిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, రాజకీయాల్లో వ్యక్తిగత శత్రువులంటూ ఎవ్వరూ ఉండరని, పాలసీల పరంగా మాత్రమే విభేదాలు ఉంటాయని అన్నారు. ప్రజల సంక్షేమమే తమ రాజకీయ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కొండగట్టు తనకు పునర్జన్మ ప్రసాదించిన పవిత్ర స్థలమని పేర్కొన్న పవన్ కళ్యాణ్, ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉందని భావోద్వేగంగా చెప్పారు. ఈ సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయంలో టీటీడీ కేటాయించిన రూ.35.19 కోట్లతో నిర్మించనున్న దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు విచ్చేయగా, హెలిప్యాడ్ వద్ద తెలంగాణ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం రెండు రాష్ట్రాల మధ్య స్నేహభావాన్ని, ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను ప్రతిబింబించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
