Thursday, May 8, 2025
- Advertisement -

మిగిలింది ముగ్గురే…!

- Advertisement -

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అవసాన దశకు చేరినట్లే కనిపిస్తోంది. వరుస పరాజయాలు, నేతల వలసలతో ఆపార్టీ తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది. తాజాగా టీడీపీని వీడి వలస వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలు.. అధికారికంగా టీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యారు. తమను తెరాసలో విలీనం చేయాలంటూ వరంగల్‌ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరరావు రాసిన లేఖను అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి ఆమోదించారు.ఈమేరకు అసెంబ్లీ సెక్రెటరియేట్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

2014లో సైకిల్‌ గుర్తుపై గెలిచిన ఎర్రబెల్లి దయాకరరావు, తలసాని శ్రీనివాసయాదవ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సాయన్న, తీగల కృష్ణారెడ్డి, వివేకానందగౌడ్‌, ధర్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, రాజేందర్‌రెడ్డిలు ఇకపై టీఆర్‌ఎస్‌ సభ్యులుగా కొనసాగుతారు.

 స్పీకర్‌ మధుసూదనాచారి నిర్ణయంతో… తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ బలం 15 నుంచి మూడుకు పడిపోయింది. ప్రస్తుతం టీడీపీలో రేవంత్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్యలు మాత్రమే మిగిలారు. వీరిలో సండ్ర వెంకట వీరయ్యను కూడా గులాబీ గూటికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. నోటుకు ఓటు కేసులో సండ్ర వెంకట వీరయ్య నిందితుడిగా ఉన్నాడు. కేసు విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తామన్న హామీతో ఆయనపై గులాబీ నేతలు వల వేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటే.. ఎల్‌బి నగర్‌ ఎమ్మెల్యే, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్యను తటస్థంగా ఉండేలా గులాబీ నేతలు ఒప్పించినట్లు చెబుతున్నారు. ప్రస్తుత శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు ముగిసేసరికి.. తెలుగుదేశం పార్టీకి ఒక్క రేవంత్‌రెడ్డి తప్ప ఎమ్మెల్యే అన్నవాడే ఉండడడని గులాబీ శ్రేణులు గుసగుసలు పోతున్నాయి. 

గడచిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ బాధ్యతలను చేపట్టిన చినబాబు లోకేశ్‌ కూడా ఇప్పుడు తెలంగాణలో పార్టీని పక్కన పెట్టేసినట్లే కనిపిస్తోంది. తెలంగాణలో పార్టీకి అన్ని విధాలా తానే దిక్కుగా ఉంటానన్న యువనేత ఇప్పుడు కనీసం పార్టీ ప్రధాన కార్యాలయానికి రావడం కూడా మానేశాడని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పార్టీకి బలమని భావించే కార్యకర్తలు కూడా గంపగుత్తగా వలస వెళ్లడం ఖాయమని అంటున్నారు.

మొత్తానికి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తి దయనీయంగా ఉందన్నది మాత్రం వాస్తవం. అమరావతి నిర్మాణం.. అక్కడి భూముల కొనుగోలు గోల్‌మాల్‌ అంశాలతో సతమతమవుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. తెలంగాణలో పార్టీని బతికించేందుకు ఏ మంత్రం వేస్తాడో వేచి చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -