ఆకాశంలో చైనా కృత్తిమ చంద‌మామలు…

ఆకాశంలో మ‌రో కొత్త ఆవిష్క‌ర‌ణ‌కు సిద్ద‌మైంది చైనా. చందమామను అందుకోవడం దేవుడెరుగు కానీ..ఏకంగా చందమామలనే తయారుచేసి అంతరిక్షంలోకి పంపుతుందట.ఇది వినడానికి ఆశ్చ‌ర్యంగానే ఉన్నా మీరు వింటున్న‌ది నిజం.రాత్రి వేళల్లో స్ట్రీట్ లైట్లకు బదులు ఈ చందమాల నుంచి వచ్చే కాంతిని వాడేసుకోవాలనేది చైనా ఐడియా.

భూమికి సుమారు 380,000 కిమీల దూరంలో ఉన్న చందమామ రాత్రి వేళల్లో కాంతి వెదజల్లుతుంది. సూర్యుడి కాంతి చందమామ నుంచి పరివర్తన చెందడంతో ఆ వెలుగు భూమిపై పడుతుంది. చైనా కూడా ఇదే సూత్రాన్ని కృత్తిమ చంద‌మామ‌ల‌ను త‌యారు చేయాల‌ని భావిస్తోంది. అయితే ఇవి చంద్రునితో పాటే సూర్యుని కాంతిని సేకరించి నగరాలను కాంతివంతం చేస్తాయి. కాకపోతే చంద్రునికన్నా వీటి కాంతి ఎనిమిది రెట్లు అధికంగా ఉంటుంది.

కృత్రిమ చందమామల్లోని అద్దంపై పడే సూర్యకాంతి 3,600 చ.కిమీల నుంచి 6,400 చ.కిమీల విస్తీర్ణం వరకు పరివర్తనం చెందుతుందని అంచనా. ఇది చంద్రుడి నుంచి వెలువడే కాంతి కంటే రెట్టింపు ఉంటుంది. కృత్రిమ చందమామలను అంతరిక్షంలోకి పంపే తేదీలను, ఇతర వివరాలను 2020 కల్లా ప్రకటిస్తామని చైనా తైన్ఫూ న్యూ డిస్ట్రిక్ట్ సిస్టమ్ సైన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ముఖ్య శాస్త్రవేత్త ఊ చున్‌ఫంగ్ తెలిపారు. 2022 కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.