భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగొయ్ నియామకం లాంఛనమైంది. తదుపరి సీజేఐగా జస్టిస్ గొగొయ్ పేరును సిఫార్సు చేస్తూ ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జస్టిస్ దీపక్ మిశ్ర అక్టోబరు 2న పదవీ విరమణ చేయనున్నారు. ఆ మరుసటి రోజే అంటే అక్టోబరు 3న జస్టిస్ గొగొయ్ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
జస్టిస్ గొగొయ్ వచ్చే ఏడాది నవంబరు 17 వరకు సీజేఐ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ గొగొయ్ 1954లో అసోంలో జన్మించారు. 1978లో బార్‌లో చేరారు. 2001 ఫిబ్రవరి 28న గువహాటి హైకోర్టులో శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. 2010 సెప్టెంబరులో పంజాబ్, హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2011 ఫిబ్రవరిలో అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2012 ఏప్రిల్‌లో పదోన్నతి పొందారు.
తన తర్వాత సీజేఐగా అర్హులైన వారి పేరును సిఫారసు చేయాల్సిందిగా కేంద్ర న్యాయశాఖ కోరగా.. దీపక్ మిశ్రా ఈ మేరకు తన అభిప్రాయాన్ని ఓ లేఖ ద్వారా తెలియజేశారు. భారత 45వ సీజేఐగా దీపక్ మిశ్రా 2017 ఆగస్టు 28న బాధ్యతలు స్వీకరించారు. అక్టోబర్ 3న భారత 46వ సీజేఐగా రంజన్ గొగోయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. గొగోయ్ పదవీ కాలం వచ్చే ఏడాది నవంబర్ 17తో ముగియనుంది.