నేడు ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలైంది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు భద్రాద్రి, వేములవాడ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం, జాగరణ, పూజాదికారాలు జరిపితే.. ఆ ఏడాదంత మనశ్శాంతిగా, సమస్యలు లేకుండా, ఆరోగ్యంగా, ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మిక వాదులు విశ్వసిస్తారు. మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠమంటే సాక్షాత్తూ స్వర్గమేనని, అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతాయి.

తిరుమల శ్రీవారి ఆలయ వైకుంఠ ద్వారాలు గత అర్ధరాత్రి తెరుచుకోగా, తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి ప్రముఖులను దర్శనానికి ఆహ్వానించారు. ఇప్పటికే రెండున్నరవేల మందికిపైగా స్వామి వారిని దర్శించుకున్నట్టు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

నాలుగు గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇచ్చారు.ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజన్న ఆలయాల్లోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు ప్రారంభమయ్యాయి. భద్రాచలంలో గరుడ వాహనంపై సీతారాములు, హనుమంత వాహనంపై లక్ష్మణుడు దర్శనం ఇస్తున్నారు.