తెలుగు రాష్ట్రాల్లో మెమోజీల వివాదం

ఈ మధ్య యూ ట్యూబులో మెమోజీ వీడియోలు నవ్వులు పండిస్తున్నాయి. మెమోజీ వీడియోలు ఏంటని కొందరికి డౌట్ రావచ్చు. ఇదేనండి కోతి మొకంతో పాటు పాండా, కుక్క, నక్క, పులి, ఇంకొన్ని ఫేసులతో కనిపిస్తూ కామెడీ చేసే వీడియోలే మెమోజీ వీడియోలు. స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన కామెడీని ఆ మెమోజీలతో మనకందిస్తున్నారు. అలాంటి వీడియోలను చూసి ఇంటిల్లపాదీ హాయిగా నవ్వుకుంటున్నారు. అందుకోసం వారు పడుతున్న కష్టాన్ని కచ్చితంగా అభినందించాల్సిందే. మనందరం అభినందిస్తున్నాం, ఆదరిస్తున్నాం, సో మరోసారి అలాంటి వీడియోలు చేసి మనల్ని నవ్విస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను.

యూ ట్యూబర్ల కడుపుకొడతారా ?
కానీ ఈ మధ్య ఆ వీడియోలు చేసే వారిలో కొందరు చేస్తున్న దుష్ప్రచారం చాలా దారుణంగా ఉంది. అత్యంత అమానవీయంగా ఉంది. ఇతర క్రియేటర్ల ఆత్మాభిమానంతో పాటు అనేకమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలనూ దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారు. తమకు తోచిన రీతిలో మిమ్మల్ని నవ్వించి, మీ మెప్పు పొంది, మీరు ప్రోత్సహిస్తే ఎదగాలని కోరుకుంటున్న అనేమందిని కొందరు కించపరుస్తూ, ఎగతాళి చేస్తూ, అవమానిస్తున్నారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని కాపీ కొట్టేస్తున్నారు. ఫేక్ వీడియోలు చేసేస్తున్నారు. అని గుండెలు బాదుకుంటూ అబద్దాలు ప్రచారం చేస్తూ ఇతర క్రియేటర్లను ప్రజల ముందు దొంగలుగా చిత్రీకరించే చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు ఫస్ట్ కాపీ కొట్టడం మొదలు పెట్టిందే వాళ్లు. సీరియళ్లు, సినిమా డైలాగులు, పాటలకు పేరడీలు చేశారు. పాపులర్ డైలాగులను వాయిస్ చేంజ్ చేసి, మాడ్యులేషన్ చేంజ్ చేసి రకరకాలుగా కాపీ పేస్ట్ చేసిందేవాళ్లు. అలా చేయడం కూడా తప్పేం కాదు. ఏదో చేయాలనే ఆరాటంతో ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ప్రయత్నించారు. కానీ ఇప్పుడు సక్సెస్ వచ్చాక తామేదో నీతిమంతులు లాగా, ఇతర క్రియేటర్లను దొంగలుగా చిత్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు. వీళ్లు చేస్తున్న దుష్ప్రచారంతో కొందరు అమాయక ప్రజలు కూడా ఆ కోతి, పాండా, కుక్క మెమోజీలు వాళ్లవే కాబోలు. వాళ్లవే ఇతరులు వాడేస్తున్నారు కాబోలు అని గుడ్డిగా నమ్మేస్తున్నారు.

టెక్నాలజీ ఎవడబ్బ సొత్తు ?
కానీ నిజమేంటంటే కోతి మెమోజీలు, పాండా మెమోజీలు, నక్క, కుక్క, పిల్లి, పులి, ఇతర రకరకాల మెమోజీలు మన వాళ్లెవరో క్రియేట్ చేసినవి కావు. వీటిని అందరూ అంత ఈజీగా కొనుక్కోలేరు కూడా. ఆ మెమోజీలు మనలో ఎవరైనా వాడుకోవచ్చు. కాకపోతే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది. యాపిల్ ఫోన్, ఐఫోన్ లలో ఇవి ఉంటాయి. ఎలాంటి ఐ ఫోన్ చూసినా, ఒక్కో ఫోన్ కనీసం లక్ష, లక్షన్నర వరకూ ధరలు ఉన్నాయి. ఆ ఫోన్లు కొనుక్కుంటే మాలాంటి మెమోజీలు ఎవరైనా వాడుకోవచ్చు. వాటి మీద ఏ ఒక్కరికో రైట్సు లేవు. ఏ ఒక్కరో ప్రత్యేకంగా ఆర్డరించి తయారు చేయించుకున్నవీ కావు. యాపిల్ ఫోన్ వాడు అమ్ముకుంటున్నాడు. లక్షలు పెట్టికొన్నవాళ్లు ఎవరైనా వాడుకోవచ్చు. వాడుకుంటున్నారు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం నుంచే అమెరికాలో ఈ మెమోజీ వీడియోలు వెరీ వెరీ పాపులర్. మనం రోజూ వాట్సాప్ మెసేజులు ఎమోజీలతో షేర్ చేసుకుంటున్నట్లు, గుడ్ మోర్నింగ గుడ్ నైట్ మెసేజులతో పాటు, ఇతర మెసేజులు షేర్ చేసుకుంటున్నట్లు వాళ్లు ఈ కోతి, కుక్క, నక్క ఫేసుల మెమోజీలతో రోజుకు కొన్ని లక్షల మెసేజులు షేర్ చేసుకుంటారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే ఇవి వాడుకలోకి వస్తున్నాయంతే.

మిగిలిన వాళ్లు నవ్వించకూడదా ?
ఈ కరోనా కష్టకాలంలో చాలామంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయారు. అలాంటి వారికి ఇలాంటి వీడియోల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మేం కూడా చాలా కష్టపడుతున్నాం. మాతో పాటు చాలామంది చాలా కష్టపడుతూ మీ ముందుకు వస్తున్నారు. కేవలం మిమ్మల్ని నవ్వించాలన్నదే ప్రధాన ఉద్దేశమైతే, చాలామందికి ఉపాధి కల్పించాలన్నది రెండో ఉద్దేశం. కానీ మాలాంటి వారి మీద కాపీ కాపీ అని కాకిగోలతో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదేదో వారి సొత్తులాగా. పైగా మేం దారి చూపాం. మేం బతుకుతున్నాం. మా దారిలో మిగిలిన వాళ్లు కూడా బతకనీ అని ప్రచారం చేస్తున్నారు. వాళ్లేమైనా ఇతర క్రియేటర్లకు లక్షల రూపాయల ఐ ఫోన్లు కంప్యూటర్లు కొనిస్తున్నారా ? కంటెంట్ ఇస్తున్నారా ? ఏమిస్తున్నారని అలా మాట్లాడుతున్నారో అర్ధం కావట్లేదు. ఇక్కడ టేలంట్ ఏ ఒక్కడి సొత్తో కాదు. టెక్నాలజీ అందరి సొత్తు. సత్తా ఉన్నోడు ఎవడైనా వాడుకోవాల్సిందే.

ఇతర క్రియేటర్లను అవమానిస్తారా ?
నేనే నవ్విస్తున్నాను అని అనుకోవడం అహంకారం
నేనే నవ్వును పరిచయం చేశానని అనుకోవడం అమాయకత్వం
నేనే నవ్వును కనిపెట్టేశానని అనుకోవడం మూర్ఖత్వం
నేనే నవ్విస్తున్నాను అనుకో తప్పులేదు
కానీ నేనే నవ్వులు కనిపెట్టానని అనుకుంటే నవ్వులపాలైపోతావ్
నేను రాకముందు నవ్వులే లేవు,
నేను లేకపోతే నవ్వడమే రాదు…
అని అనుకుంటే అంతకుమించిన కామెడీ లేదు.
నేనూ నవ్విస్తున్నాను అని అనుకోవడమే ఆనందం
దమ్మున్న కంటెంటుతో నవ్వించు… కానీ…
కాపీ అంటూ కాకిగోలతో నవ్వులపాలు కాకు
కంటెంట్ నీదే కానీ టెక్నాలజీ నీది కాదు.
ఆ మాటకొస్తే టెక్నాలజీఎవ్వడబ్బ సొత్తూ కాదు.
ఫోన్, లైట్, గ్యాస్, ట్రైన్, ఫ్లైట్, టీవీ, ట్విట్టర్, ఫేస్ బుక్, కంప్యూటర్, గూగుల్, యూ ట్యూబ్, వ్యాక్సిన్లు, మెడిసిన్లు, అన్నీ కనిపెట్టినోళ్లే వాడుకుంటే మన మనుగడే లేదు.
ఇవన్నీ మేమే కనిపెట్టాం అని, కనిపెట్టినోళ్లు అనుకుంటే మనవరకూ వచ్చేవా ?
అంతెందుకు కాపీ, ఫేక్ అంటూ గొంతు చించుకుంటున్న వాళ్లు గూగుల్, ట్విట్టర్, ఫేస్ బుక్, యూ ట్యూబ్ లో వాళ్ల వీడియోలు ఎందుకు పెడుతున్నారు ? అంటే వాళ్లు ఫేస్ బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్, గూగుల్ ను కాపీ కొట్టేసినట్టా ? కాదు కదా, వీళ్ల కంటెంటును ఆ టెక్నాలజీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అంతే.

మీరు మాత్రమే సంపాదించుకోవాలా ? మీరు మాత్రమే బతకాలా ?
లక్షలు పెట్టి టెక్నాలజీ కొనుక్కుని సొంత తెలివి, సొంత కష్టం, సొంత అనుభవాలతో, ఎవడి సొంత కంటెంటుతో వాడు వస్తే అది కాపీ ఎందుకవుతుంది ? అంటే మీరు మాత్రమే నవ్వించాలా ? మీరు మాత్రమే బతకాలా ? మిగిలిన వాళ్లు బతక కూడదా ? మీకు మాత్రమే జనం జేజేలు పలకాలా ? మిగిలిన వాళ్లను ఆదరించకూడదా ? మిగిలిన వాళ్లు జనాన్ని నవ్వించకూడదా ? మిగిలిన వాళ్లు టెక్నాలజీ వాడుకోకూడదా ? ఏది కాపీయో ? ఏది టెక్నాలజీయో ? కూడా తెలియని కొందరు అమాయక ప్రజలను. మిమ్మల్ని ఆదరించి, ప్రోత్సహిస్తున్న ప్రజలనూ తప్పుడు మెసేజులు ఇచ్చి పక్కదారి పట్టిస్తారా

కొత్తవాళ్లను ప్రోత్సహిస్తేనే కొత్త కామెడీ
తెలుగుప్రజలకు కామెడీ కొత్త కాదు, కమెడియన్లూ కొత్త కాదు. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు కామేడీలోనూ కొత్తదనం వస్తోంది. కొత్త తరం వస్తోంది. కొత్త టెక్నాలజీని వాడుకుంటోంది. ఇక్కడ కంటెంట్ మాత్రమే ఎవడిది వాడికి సొంతం. టెక్నాలజీ మాత్రం అందరి సొంతం. విశ్వవ్యాప్తం. ఆ టెక్నాలజీని వాడుకోవడంలో ఒకరు ముందు ఇంకొకరు వెనుక అంతే తేడా. వీరి దుష్ప్రచారం చూస్తుంటే నాకైతే ఒక్కటర్ధమవుతోంది. భయపడుతున్నారని. కొత్త చానెళ్లు వస్తే, ప్రజలను నవ్విస్తే వారినీ ప్రజలు ఆదరిస్తారని భయపడుతున్నారు.

ఆరోగ్యకరమైన పోటీ అవసరం
ఒకటి మాత్రం నిజం. నవ్వించేవాళ్లు ఎంతమంది వచ్చినా ప్రజలు ఆదరిస్తారు. మేమే నవ్వించాలి. మిగిలిన వాళ్లు నవ్వింంచకూడదు అనే నేరో మైండ్ పక్కన పెట్టి, బ్రాడ్ మైండుతో ఆలోచించి, పోటీతత్వాన్ని కోరుకోవాలి. నేను దమ్మున్న కంటెంటుతో వచ్చాను. మీరు కూడా ఇంతకుమించి రండి. అని ఆహ్వానించాలి. ప్రోత్సాహించాలి. నేను ఈ కంటెంటుతో నవ్వించాను. మీరు ఏ కంటెంటుతో నవ్విస్తారో రండని సవాల్ విసరాలి. పోటీ ఉంటేనే మనమెవరైనా మరింత రాటుదేలుతాం. రాణించగలుగుతాం. మరిన్ని విజయాలు అందుకోలగుతాం. మన సత్తా తెలిసేది కూడా పోటీ ఉన్నప్పుడే. అంతేకానీ ఏమీ లేని చోట కలుపుమొక్కే కల్పవృక్షమన్నటు అయితే అది గెలుపే కాదు. అది విజయమే కాదు. అందులో కిక్కే రాదు. నేనే బతకాలి. నేనే నవ్వాలి. నేనే నవ్వించాలి. ఎదుటివాడు చావాలి. ఎదుటివాడి మీద దొంగ అని ముద్రవేసేయాలి అని అనుకోవడం మానవత్వం కాదు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. నాతో పాటు నా చుట్టూ ఉన్నవాళ్లూ ఎదగాలని కోరుకోవాలి. అంతేకానీ నేనే ఎదుగుతాను. నన్నే ఎంకరేజ్ చేయండి. మిగిలినవాళ్లను ద్వేషించండి అని దిగజారుడు ప్రచారం చేయేకూడదు. లేదంటే కామ్ గా ఎవరిపని వాళ్లు చేసుకోవాలి.

Related Articles

Most Populer

Recent Posts