‘వీ-డే’కు బ్రిటన్ సర్వసన్నద్ధమైంది. 80ఏళ్లకు పైబడిన వారికి, నర్సింగ్ హోం వర్కర్లకు మంగళవారం వ్యాక్సినేషన్ చేయించేందుకు 8 లక్షల ఫైజర్ టీకా డోసులను సిద్ధం చేసింది. ఇందుకోసం పక్కా ప్రణాళికలను అమలు చేయనుంది.
దాదాపు 95శాతం ప్రభావవంతమైన ఫైజర్ అత్యవసర వినియోగానికి ఈ నెల 2న అనుమతులిచ్చింది బ్రిటన్ ప్రభుత్వం. ఫలితంగా ఈ టీకాలు బెల్జియం నుంచి ఆదివారం ఆ దేశానికి చేరుకున్నాయి. ఎంపిక చేసిన ఆసుపత్రులకు మాత్రమే ప్రస్తుతం వీటిని సరఫరా చేశారు.
వచ్చే ఏడాది జనవరి 25 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు బ్రెజిల్ సావో పాలో రాష్ట్ర గవర్నర్ వెల్లడించారు. ఈ రాష్ట్రంలో 46మిలియన్ మంది ప్రజలున్నారు. చైనా అభివృద్ధి చేస్తున్న కరోనావాక్ను సావో పాలో లోని బుటన్టన్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేయనుంది. అయితే దీనికి బ్రెజిల్ ఆరోగ్యశాఖ నుంచి ఇంకా అనుమతి లభించలేదు.
