తండ్రి ఎంపీ హోదాలో ఉన్నప్పుడే కాదు.. ఆయనకు ఆ పదవి పోయినా తామేం తగ్గలేదని నిరూపించుకొన్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ తనయులు. తాజాగా హర్షకుమార్ తనయుడు సందీప్ ఒక యాక్సిడెంట్ చేసి వార్తల్లోకి వచ్చాడు.
కారును అతి వేగంతో నడిపి ఒక మోటర్ సైకిల్ ను ఢీ కొట్టి ముగ్గురిని తీవ్ర గాయాలపాల్జేశాడితను. రాజమండ్రి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
సంఘటన స్థలం లోని ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆదివారం హర్షకుమార్ తనయుడు సందీప్ తన స్నేహితులతో కలిసి కారులో అతి వేగంగా వచ్చి యాక్సిడెంట్ చేశాడు. వీరి కారు ముందుగా డివైడర్ ను ఢీ కొని తర్వాత మోటర్ సైకిల్ ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురూ గాయాలపాలయ్యారు. కారు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కారు ముందు చక్రాలు ఊడిపోయాయి అంటే.. వారు ఎంత వేగంతో వచ్చారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ యాక్సిడెంట్ జరగగానే హర్షకుమార్ తనయుడు, అతడి స్నేహితులు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. కారు కు బెలూన్లు ఉండటంతో వారికి ఎలాంటి ప్రమాదం జరగనట్టుగా తెలుస్తోంది. మరి వెనుకటికి కూడా హర్షకుమార్ ఫ్యామిలీ పలు వివాదాలను ఎదుర్కొంది. సమైక్యవాదులపై హర్షకుమార్ తనయులు దాడి చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. మరి ఇప్పుడు హర్షకుమార్ మాజీ ఎంపీ అయిపోయినా.. ఆయన తనయులు మాత్రం తగ్గట్లేదేమో!