ఉమ్మడి రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండాపోయింది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు కష్టపడి పగలు, రాత్రి కష్టపడి రాజధాని ఎక్కడ బాగుంటుందని సర్వే చేసి ఓ అంచనాకు వచ్చి కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యన రాజధాని నిర్మించాలని నిర్ణయించాడు. రాజధానికి అమరావతి అని పేరు పెట్టాడు. దీని ఎంపికతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య భూముల రేట్లు దాదాపు వంద రెట్లు పెరిగిపోయాయి. ముందే కృష్ణా నది పరివాహాక ప్రాంతం కావడంతో సారావంతమైన భూములు ఉన్నాయి. ఈ భూముల రేట్లు ఒక్కసారిగా కోట్లకు చేరాయి. ఆ రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో రూ.లక్షల్లోనే మీకు అమరావతిలో భూములు ఇప్పిస్తామని ఓ పోలీస్ అధికారి చెబుతున్నాడు. ఆ అధికారి మాటలు వింటే మీరు మోసపోయినట్టే. ఇటీవల దొరికిన ఓ సీఐ నడిపిన తతంగం వింటే షాకవుతారు.
నెల్లూరులోని గూడూరు పట్టణం సొసైటీ ప్రాంతానికి చెందిన కాకర్ల శేషారావు గుంటూరు సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో సీిఐగా పని చేస్తున్నాడు. తనకు రాజకీయంగా ఢిల్లీస్థాయిలో పలుకుబడి ఉందని కొంతకాలంగా తన సొంత జిల్లా నెల్లూరు, తాను పని చేస్తున్న గుంటూరు జిల్లాలోనూ, చిత్తూరు జిల్లాలో ప్రచారం చేసుకున్నాడు. శేషారావు సహకారంతో పాల్వాయి ప్రసన్న లక్ష్మీ అలియాస్ గడ్డం ప్రసన్న లక్ష్మీ కుటుంబసభ్యులు గూడూరుకు చెందిన ఆక్వా రైతు రాయపనేని రమణయ్య నాయుడును కలిశారు. మీకు రాజధాని అమరవాతి సమీపంలో భూములు ఇప్పిస్తామని నమ్మబలికారు. రూ.లక్షల్లోనే ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ముందే సీఐ చెప్పడంతో రమణయ్య నాయుడు నమ్మి డబ్బులు ఇచ్చేశాడు.
డబ్బులు తీసుకున్న అనంతరం ఎంతకీ ఈ భూముల విషయం తేలకపోవడంతో తాను మోసపోయానని గమనించిన రమణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడు నడిపిన గుట్టంతా బయటపడింది. భూముల కొనుగోలు కోసం రమణయ్య నుంచి రూ.లక్షలు దండుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గుంటూరు సీసీఎస్‌లో పని చేస్తున్న సీిఐ కాకర్ల శేషారావు – ఆయన కుటుంబ సభ్యులను గూడూరు ఒకటో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
అయితే ఆ సీఐ పద్మశ్రీ అవార్డు ఇప్పిస్తానని రూ.4 కోట్లకు కూడా బేరం పెట్టి పట్టుబడ్డాడు. ఈ రెండు కేసుల్లో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.