రాహుల్ దూబే అనే ఓ భారతీయ-అమెరికన్‌కు సమున్నత గౌరవం దక్కింది. టైమ్ మేగజైన్ విడుదల చేసిన ‘హీరోస్ ఆఫ్ 2020’ జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. 70 మంది ‘బ్లాక్ లివ్స్ మేటర్’ ఉద్యమకారులకు తన ఇంటిలో ఆశ్రయం కల్పించినందుకు గానూ ఆయనను టైమ్స్ ఈ ఏటి మేటి హీరోల్లో ఒకరిగా అభివర్ణించింది.
నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా.. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్ సమీపంలో జూన్1న ఆందోళనకారులు నిరసన బాట పట్టారు. ఆ రాత్రి 7 గంటల తర్వాత కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన నిరసనకారులను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. బారికేడ్లను అడ్డుగా పెట్టారు. పెప్పర్ స్ప్రేతో దాడులకు దిగారు. అయితే.. ఆ సమయంలో వారికి సహాయం చేయడానికి రాహుల్ దూబే సిద్ధమయ్యారు. తన ఇంటి తలుపులు తెరిచి వారికి ఆశ్రయం కల్పించారు.
ఆ తర్వాత.. రాహుల్ చేసిన సాయానికి కృతజ్ఞతగా ట్విట్టర్ వేదికగా ఆయనకు నిరసనకారులు ప్రశంసలు కురిపించారు. లక్ష్యం కోసం వెనుకడుగు వేయొద్దని, శాంతిమార్గంలో నిరసన కొనసాగాలని రాహుల్ దూబే తమకు స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఇచ్చారని వారంతా కొనియాడారు.
