రాజకీయ రూపంలోని హిందుత్వ వాదం అంటే భారతీయ జనతా పార్టీ… భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వ వాదం. ఇలా నిర్వచించుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అనుకూల రాజకీయాలను అనుసరించడం.. మైనారిటీలకు కోపం వస్తుందని ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడుతుండటంతో.. దేశంలో ఆ పార్టీపై వ్యతిరేతక పెల్లుబుకింది. ఇదే హిందుత్వవాద భారతీయ జనతా పార్టీకి ప్లస్ పాయింట్ అయ్యింది.
మరి అలాంటి మెట్లు ఎక్కివచ్చి అధికారాన్ని సొంతం చేసుకొన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు క్రమంగా హిందుత్వవాదానికి దూరం అవుతోంది. మైనారిటీ అనుకూల రాజకీయాలు.. ఓటు బ్యాంకు రాజకీయాలకు దగ్గర అవుతోంది. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి అంశాల గురించి కూడా మోడీ ప్రభుత్వ తీరు వివాదాస్పదం అవుతోంది.
గతంలోఅయితే భారతీయ జనతా పార్టీ చాలా సార్లు రామమందిర అంశాన్ని తమ అజెండాలో భాగంగా పేర్కొంది. తమకు సంపూర్ణమైన అధికారం చేతికి అందితే అయోధ్యలో మందిర నిర్మాణం చేపడతామని బీజేపీ ప్రకటిస్తూ వచ్చింది. మరి ఇప్పుడు బీజేపీకి సంపూర్ణ అధికారం అయితే దక్కింది. అయితే ఇప్పుడు బీజేపీ టోన్ వేరుగా ఉంది. ఇప్పుడు మందిరం గురించి ఆలోచించడం లేదు అని కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ ముఖ్యనేత రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
దీంతో బీజేపీ హిందుత్వాదానికి దూరం అవుతోందని అనుకోవాల్సి వస్తోంది. తీరుపై హిందుత్వవాద సంస్థలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాము అయోధ్యరామమందిర నిర్మాణం విషయంలో బీజేపీని నమ్ముకోలేదని.. ఈ విషయం గురించి ప్రభుత్వ జోక్యం అనవసరమని వారు ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తమకు సాయం చేయకపోయినా పర్వాలేదు.. ఇలా మాట్లాడాల్సిన అవసరం మాత్రం లేదని కమలం పార్టీ నేతకు హిందుత్వవాద సంస్థలు స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మందిర నిర్మాణం జరుగుతుందని వారు స్పష్టం చేశారు.