పేరుకే బీజేపీ – టీడీపీ కూటమి అని కేంద్రం నుంచి కొత్తగా కాదుకదా న్యాయంగా ఇప్పటికి ముందే రావలసిన నిధులు తెచ్చుకోవడంలో చంద్రబాబు భారీగా ఫెయిల్ అయ్యారు అని వాదన వినిపిస్తోంది. టీడీపీ సొంత ఎంపీలే ఈ విషయంలో చంద్రబాబు ని ఎద్దేవా చేస్తున్నారు.
ఒకానొక కాలంలో కేంద్ర ప్రభుత్వం తో పాటు జాతీయ రాజకీయాలలో కూడా చక్రం తిప్పారు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు పరిస్థితి చాలా తేడాగా ఉంది. వానలూ వరదలతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటె కేంద్రం ఒక్క పైసా కూడా విదిలించలేదు. మూడు వేల కోట్ల మేరకు పంట నష్టం జరిగితే కనీసం వెయ్యి కోట్లు కూడా ఇవ్వనేలేదు. ఈ విషయం మీద తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని కేంద్రం అసలు పట్టించుకోలేదు.
ఏపీ మాదిరిగానే వానలు, వరదలతో బీభత్సంగా మారిన తమిళనాడుకు ముఖ్యమంత్రి జయ ఇలా విజ్ఞప్తి చేశారో లేదో 940 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో ఉండి కూడా ఆదేశించారు. ఇలాంటి తేడా చూపించడం పట్ల చంద్రబాబు సైతం సంతోషంగా లేరని తెలుస్తోంది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల పరిస్థితి దారుణంగా ఉంది. నెల్లూరు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సొంత జిల్లా.
వరదల పరిస్థితిని ఆయన చూశారు కూడా. కానీ సాయం విషయంలో కేంద్రం ఆడుకుంటుంది అని కబుర్లు చెప్పడం తప్ప ఎక్కడా పనికివచ్చే చర్య ఒక్కటీ తీసుకోలేదు. వరద నష్టం మీద సమగ్ర నివేదిక పంపించినా కూడా కేంద్రం సాయం చెయ్యడానికి సిద్దంగా ఉంది అని చెప్పిన ఆయన తమిళనాడు వారు ఏం నివేదిక పంపిస్తే నిధులు విడుదల చేసారో చెప్పాల్సి ఉంది.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్నాయి. జయలలితతో ఎన్నికల ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉండొచ్చు. గతంలో డిఎంకే యూపీఏలో భాగస్వామిగా ఉంది. ఈసారి కూడా అటే మొగ్గుతుందేమో. ఈ లెక్కలన్నీ సారాంశం గా తీసుకుని తమిళ నాడుకి తెగ మంచి చేస్తోంది కేంద్రం అనే వాదన వినిపిస్తోంది.