తెలంగాణలో ఈ మద్య హాట్ టాపిక్ గా నిలిచిన మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ఎట్టకేలకు విడుదల అయింది. వచ్చే నెల అనగా నవంబర్ 3 న మునుగోడు బై ఎలక్షన్స్ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక ఈనెల 7 నుంచి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అక్టోబర్ 14 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ అక్టోబర్ 17 వరకు గడువు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక ఇప్పటికే మునుగోడు చుట్టూ రాజకీయ వేడి తారస్థాయిలో కొనసాగుతుండగా.. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల ప్రకటించడంతో ఆ వేడి పతాకస్థాయికి చేరుకోనుంది. .
ఇక ముందుగోడు బై ఎలక్షన్స్ ను వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు కోసం విశ్వ ప్రయత్నలే చేస్తున్నాయి. మునుగోడు గత ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అంతే కాకుండా రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు తల్లిలా భావించే తన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరారు. దీంతో రాజకీయ వేడి రాజుకుంది. మునుగోడు నియోజిక వర్గం కాంగ్రెస్ కు కంచుకోట.. అయితే మునుగోడులో బలమైన నేతగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ వీడడంతో.. మునుగోడులో కాంగ్రెస్ స్థానం నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు రాజగోపాల్ రెడ్డి రాకతో బీజేపీ మునుగోడులో పాగా వేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇక టిఆర్‌ఎస్ విషయానికొస్తే.. మునుగోడు ఆ పార్టీకి సిట్టింగ్ స్థానం కానప్పటికి.. టిఆర్‌ఎస్ మునుగోడుపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే దుబ్బాక, హుజూరాబాద్ వంటి నియోజిక వర్గాలలో జరిగిన ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ ఘోరంగా ఓటమిపాలు అయింది. దీంతో మునుగోడు బైపోల్ లో గెలిచి పరువు నిలిపుకోవాలని టిఆర్‌ఎస్ చూస్తోంది. దీంతో మూడు ప్రధాన పార్టీల త్రిముఖ పోరుతో మునుగోడు ఉపఎన్నిక టిఎస్ లో రసవత్తరంగా మారిందనే చెప్పవచ్చు.