ప్రత్యేక హోదా కోసం పోరాడుతోన్న ఆంధ్రప్రదేశ్ నేతలకు, ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ షాక్ ఇచ్చింది. పన్ను రాయితీలు సాధ్యపడే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఏపీకి ఇస్తే.. ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని తెలిపింది. అంతేకాదు, ఆత్మ గౌరవం అంటూ రాజకీయ వేడిని పెంచుకుని ఆంధ్రప్రదేశ్ నేతలు సతమతం అవుతున్నారని సంచనల వ్యాఖ్యలు చేసింది.
ఈ రోజు తెలుగువారి సెంటిమెంట్ అంటున్నారని, ఒకవేళ రాయితీ ఇస్తే రేపు తమిళం, మలయాళం సెంటిమెంట్ అంటూ మరో ప్రాంతం వారు అంటారని పేర్కొంది.అప్పుడు వారి సెంటిమెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఏపీకి ప్యాకేజీ అమలు చేయడం ఉత్తమమని, మిగిలినవి సాధ్యం కాదని తేల్చి చెప్పింది.
నిన్న జరిగిన కీలక భేటీలో ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు ఇవ్వాలని తెదేపా నేతలు కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీకి చెప్పారు. హోదాకు బదులు ప్యాకేజీ వైపే ఆర్థిక శాఖ మొగ్గుచూపుతోంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన రాయితీలు ఆంధ్రప్రదేశ్‌కు కూడా ఇస్తే వెనుకబడిన రాష్ట్రాలైన యూపీ, బంగాల్, బిహార్ రాష్ట్రాలు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. నిన్న జరిగిన చర్చలో ఆర్థికమంత్రిత్వ శాఖతో చర్చించాకే పన్ను రాయితీలు కల్పించే అంశంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఏపీకి ఇచ్చిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా లెక్కలు చెప్పలేదని తెలిపింది. ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని తెలిపింది. కొన్ని రాష్ట్రాలకు ఇచ్చిన హోదా తమకెందుకు ఇవ్వరని అడగడంతో అర్థం లేదని వ్యాఖ్యానించింది.