మన పొరుగు దేశం పాకిస్థాన్ పతనం అంచుకూ చేరుతూ ఆర్థిక దివాళ దిశగా పయనిస్తోంది. పాకిస్థాన్ కరెన్సీ రుపీ దారుణంగా పతనమవుతూ ఉండటమే ఇందుకు ఋజువు. ప్రస్తుతం పాక్ కరెన్సీ విలువ పాతాలానికి పడిపోవడంతో ఆర్ధిక సంక్షోభం వైపు పయనిస్తోంది.
కొత్త ప్రభుత్వ నూరు రోజుల పండుగ నిర్వహించిన తర్వాతి రోజే పాకిస్తాన్ రూపాయి మారకం విలువ డాలర్‌తో పోల్చితే భారీగా పతనం అయింది. ఇంటర్ బ్యాంక్ ట్రేడింగ్‌లో శుక్రవారం మధ్యాహ్నం పాకిస్తాన్ రూపాయి ఏకంగా ఒక్క రోజులోనే పది రూపాయలు నష్టపోయి డాలర్‌కు రూ. 144కి చేరుకుంది. ఇది జీవితకాల కనీస స్థాయి. ప్రారంభంలో 142 రూపాయలకు పతనం అయి మధ్యాహ్నానికి మరో రెండు రూపాయలు నష్టపోయింది. శుక్రవారం ఒక్క రోజే రూ.10 పతనమైంది.
దేశానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయంటూ వంద రోజుల పాలన సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పినా, పాకిస్థాన్ కరెన్సీ పతనాన్ని ఆపలేక పోయింది. ఇటీవలే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ — ఐఎంఎఫ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు మరో షాకిచ్చింది. పాకిస్తాన్ ను ఈ సంక్షోభం నుంచి బయట పడేయానికి ఐఎంఎఫ్ ఇచ్చే బెయిల్-ఔట్ ప్యాకేజీ యే ఇప్పుడు పాక్ ముందుంది.
ఐఎంఎఫ్ నుంచి రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం చర్చలు జరుపుతున్నదన్న వార్తలు కరెన్సీ మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. కరెన్సీ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ కరెన్సీ మార్కెట్ డీలర్లు డిమాండ్ చేశారు.
అయితే ఐఎంఎఫ్ మాత్రం ప్యాకేజీ కోసం కఠిన ఆంక్షలను పాకిస్థాన్ ప్రభుత్వానికి విధిస్తోంది. ఇప్పటికే ఐఎంఎఫ్ బృందం పాకిస్థాన్ లో పర్యటిస్తున్నది. పాకిస్థాన్ కావాల్సిన ఆర్ధిక అవసరాల మొత్తం పై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. పాకిస్థాన్ కు చైనా అందిస్తున్న ఆర్థిక సాయం వివరాలను పూర్తిగా అందించటం జరిగిన తరవాతే బెయిల్-ఔట్ ప్యాకేజీ పై తమ నిర్ణయం ప్రకటిస్తామని ఐఎంఎఫ్ స్పష్టంగా చెప్పింది. దీనికి పాకిస్థాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.