కేంద్రానికి క్లీన్ చిట్ ఇచ్చిన కాగ్ రిపోర్ట్‌ …

కొద్ది రోజుల‌గా రాఫెల్ డీల్ వ్య‌వ‌హారం దేశాన్ని కుదిపేస్తోంది. కాంగ్రెస్ పార్టీ న‌రేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు కురిపిస్తూనే ఉంది. రాఫెల్ డీల్ విష‌యంలో అనిల్‌ అంబానీకి మోదీ మధ్యవర్తిలా వ్యవహరించారని రాహుల్ ప‌దేప‌దే విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా కాగ్ మాత్రం దీనికి సంబంధించి భాజాపాకు క్లీన్ చిట్ ఇచ్చింది. మోదీ సర్కార్ రాఫెల్ డీల్‌పై రచ్చ రచ్చ చేస్తున్న ప్రతిపక్షాలకు ఎదురు దెబ్బ తగిలింది.

రాఫెల్ డీల్‌కు సంబంధించి కాగ్ రిపోర్ట్‌ను కేంద్రం పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ పెట్టింది. ఈ డీల్‌లో ఎలాంటి కుంబ‌కోణం జ‌ర‌గ‌లేద‌ని కాగ్ రిపోర్ట్ స‌మ‌ర్థించింది. యూపీఏ హయాంలో చేసుకున్న డీల్‌తో పోలిస్తే ఇది 2.8 శాతం తక్కువని కాగ్ స్పష్టం చేసింది. భారత్‌ అవసరాలకు తగినట్లు మార్పులు చేసిన 36 యుద్ధ విమానాల కొనుగోలులో 17.08 శాతం సొమ్ము ఆదా అయినట్టు తెలిపింది. అంతేకాదు యూపీఏ-1 ప్రభుత్వం ఒప్పందంతో పోలిస్తే కొత్త డీల్‌‌లో తొలి 18 యుద్ధ విమానాలు 5 నెలల ముందే భారత్‌కు చేరతాయని పేర్కొంది. యూపీఏ హయాంలోని ఒప్పందం కంటే 9 శాతం తక్కువకు తాము ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేస్తున్నామని గతంలో కేంద్రం తెలిపింది. అయితే అది 9 శాతం కాదని 2.8 శాతమేనని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.