టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వైవిధ్యమైన కథలతో దూసుకెళ్తున్న స్టార్ హీరో సూర్య (Suriya) నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, తాజాగా శుక్రవారం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. పిస్టల్ షూటర్ సంజయ్ విశ్వనాథ్‌గా సూర్య పాత్రను పరిచయం చేస్తూ ట్రైలర్‌ను ప్రారంభించిన తీరు చాలా బాగుంది. 40 ఏళ్ల వయసు దాటినప్పటికీ తన కలలను వదలకుండా ముందుకు వెళ్లే తండ్రిగా సూర్య కనిపిస్తారు. అయితే, ఆయన కొడుకుకు ఉన్న అనారోగ్య సమస్య ఆ కుటుంబానికి పెద్ద సవాల్‌గా మారుతుంది. ఆ బాబు ఆపరేషన్‌కు అవసరమైన అవయవదాతను వెతుకుతున్న తరుణంలో మ్యాడీ (మమితా బైజు) అనే యువతి పరిచయమవుతుంది. ఆమె రాకతో ఆ తండ్రీకొడుకుల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ముఖ్యంగా తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన కథానాయకుడితో ఆమె ప్రేమలో పడటం, ఆ తర్వాత జరిగే ప్రయాణాన్ని ట్రైలర్‌లో చూపించారు.
ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి చూస్తే.. ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా, తండ్రీకొడుకుల అనుబంధం, భావోద్వేగాలు, చక్కటి హాస్యం మేళవింపుగా రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్‌లో వచ్చే డైలాగులు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచేలా ఉన్నాయి. ముఖ్యంగా ‘‘మన డబ్బు, స్టేటస్.. అన్నీ మనకు సౌకర్యం ఇవ్వాలి. అహంకారం కాకూడదు’’, అలాగే ‘‘మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదండి. ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక’’ వంటి సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వెంకీ అట్లూరి టేకింగ్, సూర్య నటన ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
