ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జులై నెలలో ఈ పథకం డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది.
ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సహాయం అందుతుంది. ఇందులో రూ. 2,000 పాఠశాలల నిర్వహణ నిధి కోసం కేటాయించగా మిగిలిన రూ. 13,000 నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. ఈ ఏడాది దాదాపు 68 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
బ్యాంక్ ఖాతా వివరాలలో చిన్న తప్పులు ఉన్నా డబ్బులు జమ కావు. కాబట్టి లబ్ధిదారులు వెంటనే కింద పేర్కొన్న మూడు పనులను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు:
- బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకింగ్: విద్యార్థి తల్లి యొక్క యాక్టివ్ బ్యాంక్ ఖాతాకు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.
- ఎన్‌పీసీఐ సీడింగ్ (NPCI / Aadhaar Seeding): ప్రభుత్వ సంక్షేమ పథకాల డబ్బులు డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా నేరుగా ఖాతాలోకి రావాలంటే ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి కావాలి.
- ఈ-కేవైసీ (e-KYC) అప్‌డేట్: మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ (KYC) వివరాలను పూర్తిగా అప్‌డేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ సాధారణ బ్యాంక్ ఖాతాకు ఎన్‌పీసీఐ (NPCI) యాక్టివేషన్ కాకపోతే వెంటనే సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అకౌంట్ తెరిచి, దానికి ఆధార్ సీడింగ్ చేయించడం ఉత్తమమైన మార్గం. మీరు ఈ పథకానికి అర్హులో కాదో తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆన్‌లైన్ సదుపాయాన్ని కల్పించింది. కింద పేర్కొన్న స్టెప్స్ ద్వారా మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు:
స్టెప్ 1: మొదట అధికారిక వెబ్‌సైట్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ను సందర్శించండి.
స్టెప్ 2: అక్కడ ఇవ్వబడిన బాక్స్‌లో తల్లి యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి.
స్టెప్ 3: ‘Scheme Type’ డ్రాప్ డౌన్ మెనూ నుండి ‘Thalliki Vandanam’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
స్టెప్ 4: సంవత్సరం (Year) వద్ద 2026-27 ఎంచుకుని, ‘Get Details’ పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: మీ ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి, స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా (Captcha) కోడ్‌ను కూడా టైప్ చేయండి.
స్టెప్ 6: ఇప్పుడు స్క్రీన్‌పై సిటిజన్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్‌తో పాటు ‘Scheme Eligibility Calculator’ కనిపిస్తుంది. ఆ ఎలిజిబిలిటీ కాలిక్యులేటర్ వద్ద అన్ని నిబంధనల ఎదురుగా Satisfied అని ఉంటే మీరు ఈ పథకానికి అర్హులైనట్లే. త్వరలోనే ఈ అర్హుల జాబితాలను గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా ప్రదర్శిస్తారు.
