కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ ఏపీ వ్యాప్తంగా నిరసన చేపట్టింది వైసీపీ. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం నుంచి భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి ఆయన మైలవరం వరకు ర్యాలీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
సూపర్ -6 హామీల అమలుపై వైయస్ జగన్ గారు అడుగుతున్న ఏ ప్రశ్నకు చంద్రబాబు వద్ద సమాధానం లేదు అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. నిరుద్యోగులకు సక్రమంగా కనీసం ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితి లేదు.. డబ్బుపై మమకారంతో వాళ్ల పొట్ట కొడుతున్నాడు అని ఆరోపించారు.
చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను ఎలా తుంగలో తొక్కారో, ఏ విధంగా రాజకీయ వెన్నుపోట్లకు పాల్పడ్డారో వివరించే కార్టూన్లు, నినాదాలతో కూడిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడి రాజకీయ చరిత్ర అంతా అబద్ధాలు, మోసాలతోనే కూడుకుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై నిరసనగా చిత్తూరు నియోజకవర్గంలో సమన్వయకర్త ఎంసి విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొనారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తణుకు నియోజకవర్గంలో నిర్వహించిన వెన్నుపోటు కు రెండేళ్లు కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పి ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అందిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, నిరుద్యోగ యువతకు భరోసా కల్పిస్తామని చెప్పి డీఎస్సీ నియామకాల విషయంలో అవకతవకలకు పాల్పడి లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేశారని అన్నారు.
