డ్రైవింగ్ లో దాదాపు 40 ఏళ్లకు పైగా అనుభవం నందమూరి హరికృష్ణ సొంతం. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చైతన్యరథంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా పర్యటించారు. ఆయన చైతన్యరథాన్ని హరికృష్ణే స్వయంగా నడిపారు. ఆ ఒక్క సందర్భంలోనే దాదాపు లక్ష కిలోమీటర్లు డ్రైవింగ్ చేసిన అనుభవం హరికృష్ణకు ఉంది. అంతే కాదు ఎప్పుడు డ్రైవింగ్ చేసినా అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. 2014లో పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పటి నుంచీ మరింత జాగ్రత్తలు తీసుకునేవారు హరికృష్ణ. వేరే డ్రైవర్ ను పెట్టుకుంటే అజాగ్రత్తతో ఉంటాడేమోనని తన కారు తానే నడుపుకునేవారు. సీటు బెల్టు పెట్టుకునేవారు. కానీ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఆయన చేసిన పొరపాట్లు కొన్ని ఆయన ప్రాణాలను బలిగొన్నాయని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పారు.
హై స్పీడ్ తో డ్రైవింగ్ చేస్తున్న హరికృష్ణ వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరిగి చూసేలోపే క్షణకాలంలో ప్రమాదం జరిగిపోయింది. అప్పటికే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న వాహనం ఆ ఒక్క క్షణంలోనే అదుపు తప్పింది. రోడ్డు నిర్మాణంలో చిన్న లోపంతో పాటు, దగ్గరలో ఉన్న స్లైడ్ టర్న్ ను హరికృష్ణ గమనించలేకపోయారు. ఆఖరి క్షణాల్లో దాన్ని చూసినా, అప్పటికే 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారును హరికృష్ణ అదుపు చేయబోయారు. కానీ క్షణాల్లో అది డివైడర్ ను ఢీకొట్టి, 20 మీటర్ల పైకి ఎగిరి పడి, 20 మీటర్ల దూరంలో రోడ్డుకు అవతలి వైపు నుంచి వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. సీటు బెల్టు కూడా హరికృష్ణ పెట్టుకోకపోవడంతో ఆయన ఎగిరి 20 నుంచి 30 మీటర్ల దూరంలో పడిపోయారు. సీటు బెల్టు పెట్టుకుని ఉండి ఉంటే, హరికృష్ణ కారులోనే ఉండేవారు. అదే సమయంలో ఎయిర్ బెలూన్స్ కూడా తెరుచుకునేవి. దీంతో ఆయన ప్రమాదం బారి నుంచి ప్రాణాలతో బయటపడగలిగేవారు.
అతివేగం, సీటు బెల్టు ధరించకపోవడం హరికృష్ణ కారు ప్రమాదానికి ప్రధాన కారణాలు. నల్గొండ జిల్లా అన్నెపర్తి సమీపంలో ఉన్న పన్నెండో పోలీస్ బెటాలియన్ కు 250 మీటర్ల సమీపంలో ఆయన కారు బోల్తాపడింది. ప్రమాదం తెల్లవారు జామున 6 గంటల సమయలో చోటు చేసుకుంది. పోలీస్ బెటాలియన్ కు చెందిన పలువురు వెంటనే స్పందించి హరికృష్ణతో పాటు కారులో ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిన వ్యాపారి రావి వెంకట్రావుతోపాటు శివాజీ అనే మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డారు. వారిని నార్కేట్ పల్లిలో కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే హరికృష్ణ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో 30 మీటర్ల దూరం వరకూ ఆయన ఎగిరిపడిపోయారు. దీంతో తలకు, ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. రక్తం పెద్దఎత్తున పోవడంతో, ఆయన పూర్తిగా స్పృహ కోల్పోయారు. వెంటనే స్థానికులు, ఆసుపత్రికి తీసుకెళ్లినా తీవ్ర రక్తస్రావం వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. లేదంటే బతికే అవకాశాలు ఉండేవని అంచనా వేశారు.