ప్రధాని నరేంద్రమోడీ ఫారిన్ టూర్ల పరంపర కంటిన్యూ అవుతోంది. మొన్నటికి మొన్న యూకే టూర్ నుంచి ప్రధాని తిరిగొచ్చారు. ఇప్పుడు సింగపూర్ టూర్. ఇదే కాకుండా… ఇంకో 3 ఫారిన్ టూర్లు కూడా రెడీ అయ్యాయి. ఇన్నిన్ని దేశాలు తిరుగుతూ అసలు ప్రధాని మోడీ ఏంచేస్తున్నారని విపక్ష నాయకులే కాదు.. జనం కూడా ఆలోచిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ప్రధాని 30 ఫారిన్ టూర్లు చేయడం వెనక ఉద్దేశం ఏంటని చర్చించుకుంటున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ… ఇదే అదనుగా మోడీ ఫారిన్ టూర్లను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇంత చేసినా.. మోడీ దేశం కోసం ఏం సాధించారంటూ కాంగ్రెస్ ఎదురుదాడి మొదలు పెట్టింది. మోడీ వరుస విదేశీ పర్యటనలతో దేశానికి ఒరిగింది ఏమీ లేదని విమర్శిస్తోంది. ఈ ఫారిన్ టూర్ల కారణంగానే… దేశ ఎగుమతులు భారీగా పడిపోయాయని కామెంట్ చేసింది.
ఒక్క కాంగ్రెస్సే కాదు. జనం కూడా మోడీ ఎందుకు ఫారిన్ టూర్లు చేస్తున్నారో అర్థం కాక ఆలోచనలో పడుతున్నారు. విదేశాలతో కీలక ఒప్పందాలు… అంతర్జాతీయంగా భారత్ ను సూపర్ పవర్ గా నిలబెట్టే ప్రయత్నాలంటూ… బీజేపీ నేతలు చెబుతూ ఉండొచ్చు. కానీ.. అవి మామూలు జనానికి ఎంత వరకు అర్థమవుతాయి? చైనా, పాకిస్థాన్ లతో ఫ్యూచర్ లో ఇబ్బంది వస్తే… ఇప్పుడు ప్రపంచ దేశాలతో చేసుకుంటున్న ఒప్పందాలు భారత రక్షణకు పనికొస్తాయని నేతలు వివరించొచ్చు. కానీ… ఈ విషయాలన్నీ జనం తలకు ఎంత వరకు ఎక్కుతాయి?
అందుకే.. బీజేపీ నేతలు ఇప్పటికైనా మేలుకుంటే మంచిదన్న వాదన వినిపిస్తోంది. మోడీ టూర్లన్నీ ఎందుకు అన్న విషయంలో కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన కానీ, వివరణ కానీ లేదు. ఈ విషయంలో వీలైతే ప్రధానితోనే… త్వరలో ఓ ప్రకటన కానీ.. ప్రెస్ మీట్ కానీ పెట్టి క్లారిటీ ఇస్తే మంచిదని కొందరు సూచిస్తున్నారు. ఆ వీలు కాకుంటే… మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరణ కానీ.. ఓ 10, 20 సెకన్ల యాడ్ కానీ షూట్ చేయించి టెలికాస్ట్ చేయిస్తే మంచిదన్న సలహా కూడా ఇస్తున్నారు. ఈ విషయం బీజేపీ జాతీయ నాయకులకు ఎప్పుడు అర్థమవుతుందో.