తమిళనాడులోని తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్తోన్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. 136 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా ప్రమాదవశాత్తు ఎయిర్‌పోర్టు ప్రహారీ గోడను ఢీకొట్టింది. గత రాత్రి 1.30 గంటల సమయంలో తిరుచ్చి విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం గోడను ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపోయింది.
పైలట్ తప్పిదం కారణంగా ప్రహరీ గోడను విమానం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రయాణుకులెవరూ గాయపడలేదు.అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బంది లేదని, అంతా సవ్యంగానే ఉందని పైలట్ సమాచారం ఇవ్వడంతో దాన్ని ముంబైకి మళ్లించారు. దీంతో 130 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
ఈ విమానంలో కెప్టెన్ గా ఉన్న డీ గణేష్ బాబుకు, బోయింగ్ 737 విమానాలు నడిపించడంతో 3,600 గంటల అనుభవముందని, ఫస్ట్ ఆఫీసర్ కెప్టెన్ అనురాగ్ కు సైతం 3000 గంటల అనుభవముందని అధికారులు తెలిపారు. తిరుచ్చి విమానాశ్రయం ప్రహరీ గోడవద్ద విమానం యాంటీనా, ఇతర భాగాలు కొన్ని కనిపించాయని, ఇద్దరు పైలట్లనూ విధుల నుంచి తప్పించి, జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు.
