ఒకొప్పుడు సినిమాల్లో బిచ్చగాళ్ల పాత్రకు కేరాఫ్ అడ్రస్ బాబు మోహన్. ఇంత కూరుంటెయ్యమ్మో.. ఇంత బువ్వుంటెయ్యమ్మో అనే పాటతో ఆలిండియా అడుక్కుతినే సంఘానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు కమెడియన్ బాబూ మోహన్. మెకాళ్ల కింద వరకూ పెద్ద నిక్కరు.. పొడుగు చొక్కా.. చింపిరి జుట్టు.. చేతిలో బొచ్చెతో ఆ పాత్ర ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా బాబు మోహన్ బెగ్గర్ పాత్రకు జీవిం పోశారు. మామ గారు సినిమాలో అయితే బాబు మోహన్ , కోటా కామిడి గురించి చెప్పాల్సిన పనిలేదు.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి టీఆర్ఎఎస్ లోకి జంప్ అయి అందోల్ ఎమ్మెల్యేగా గెలిచిన బాబుమోహన్ మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు. తనకు తిరుగులేని గుర్తింపు తీసుకొచ్చిన బిచ్చగాడి పాత్రతో ఆయన రీఎంట్రీ జరిగింది. అంతేకాదు.. సినిమా కథ కూడా దాదాపు ఆయన చుట్టూనే తిరుగుతుంది.
బాబుమోహన్ కీలక పాత్రలో బిచ్చగాడా మజాకా అనే సినిమా రెడీ అయింది. 2 దశాబ్దాల కిందట బాబుమోహన్ నుంచి ఎలాంటి కామెడీ చూశామో, దాదాపు అదే కామెడీని యాజ్ ఇటీజ్ గా చూడొచ్చంటున్నారు మేకర్స్. బిచ్చగాడి గెటప్ లో బాబుమోహన్ తో కామెడీ చేయించడంతో పాటు అతడితో పాటకు చిందులు కూడా వేయించారు. తాజాగా ఆయన బెగ్గర్ పాత్రలో నవ్వులు పూయిస్తున్న సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
తెలుగు రాష్ట్రాల్లో నేతలంతా ఎన్నికలపై ఫోకస్ పెడుతూ నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న వేళ.. ఈ ఎమ్మెల్యే ఇలా సినిమా చేయడం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల ముందు సరిగ్గా టైమ్ చూసి టీఆర్ఎస్ లో జాయిన్ అయిన బాబుమోహన్ కు ప్రత్యామ్నాయం చూసుకోమని అధిష్టానం ముందే చెప్పిందా? అన్న గుస గులు వినిపిస్తున్నాయి. దీనిలో ఎంత నిజముందో ఆగాల్సిందే.