టీటీడీ వివాదం ముదిరి పాకాన పుడుతోంది. రోజు రోజుకీ సమస్య పెద్దదవుతోంది. మరో సారి బాబును టార్గెట్ చేశారు రమణదీక్షితులు . శ్రీవారికి పల్లవ, చోళ రాజులు సమర్పించిన విలువైన ఆభరణాలను, ముస్లిం, విదేశీ దండయాత్రల నుంచి కాపాడేందుకు వంటగదిలో రహస్యంగా దాచి పెట్టినట్టు తమ పూర్వీకులు చెబుతుండేవారని, ఇప్పుడు వాటిని దక్కించుకోవడం కోసం ఆలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు విమర్శలు చేశారు.
బయటి నుంచి వచ్చే వారికి తవ్వకాలు సాధ్యం కాదని, టీటీడీలో తమవారిని నియమించుకుని ఈ పని చేశారని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారానికి సీఎం చంద్రబాబుదే బాధ్యతని అన్నారు. నిధి నిక్షేపాల కోసం తవ్వకాలు జరిగాయనడానికి తన వద్ద ఉన్న ఆధారం, వంటగదిలో జరిగిన మార్పులేనని, గదిలో కొత్త ఫ్లోరింగ్ గోడలు, ఇటుకలు మారాయని తెలిపారు.
తిరుమల ఆలయంతో పాటు రాష్ట్రంలోని పురాతన కోటల్లోనూ నిధుల కోసం ప్రభుత్వం తవ్వకాలు జరిపిస్తోందని రమణ దీక్షితులు ఆరోపించారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే టీటీడీలో అత్యధికంగా ఉన్నారని, వారి ద్వారానే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించిన ఆయన, పదవీ విరమణ చేసిన డాలర్ శేషాద్రి వద్ద రూ. 50 కోట్ల విలువైన శ్రీవారి నగలను దాచి పెట్టారని ఆరోపించారు. టీటీడీ సొమ్మును తిరుపతి కోసం, ఒంటిమిట్ట కోసం, రహదారుల నిర్మాణం కోసం వాడుతున్నారని, ఇలా నిధులను మళ్లించడం కూడా నిబంధనలకు విరుద్ధమని అన్నారు.
