ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటున్న వలంటీర్లు సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. పగలనక, రాత్రనక వెట్టి చాకిరీ చేస్తున్నా కష్టానికి తగిన ప్రతిఫలం లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి రేషన్ పంపిణీలో మూటలు మోయాల్సి వస్తోందని అన్నారు. తమకు నెలకు కనీసం రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, జాబ్‌చార్ట్ నిర్వహించాలని, ప్రమాద బీమా, చనిపోయిన వలంటీర్ల కుటుంబాలకు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాజాగా వలంటీర్ల వేతనాల పెంపు కోరుతూ వలంటీర్లు చేస్తున్న ఆందోళనపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు.
ఈ మేరకు వారిని ఉద్దేశించి లేఖ రాశారు. ఉన్న వాస్తవాలు ఏంటో తెలియకుండా రోడ్డెక్కారన్న వార్త తనను బాధించిందని జగన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి వలంటీర్లకు ఇస్తున్నది వేతనం కాదని, గౌరవ భృతి మాత్రమేనని పేర్కొన్నారు. ఏపిలో వలంటీర్ల వ్యవస్థకు మంచి పేరు వస్తుందని దీన్ని రూపు మాపేందుకు కొంత మంది కుట్ర పన్నుతున్నారని అలాంటి వారి ప్రలోభాలకు లోను కావొద్దని అన్నారు. వలంటీర్లు వారానికి ఇన్ని గంటలు, ఇన్ని రోజులు పనిచేయాలన్న నిబంధన ఏదీ లేదని సీఎం పేర్కొన్నారు.
తాను హ్యాండ్‌బుక్‌లోనూ ఇదే విషయాన్ని రాశానని గుర్తు చేశారు. పూర్తి స్థాయిలో నిరుద్యోగులుగా ఉంటూ.. సేవా దృక్పధంతో యువతీయువకులను రూ. 5 వేల వేతనంతో గ్రామ/వార్డు వలంటీర్లుగా నియమిస్తామని, ఇంతకంటే మెరుగైన ఉద్యోగం వచ్చే వరకు పనిచేస్తారని పేర్కొన్నానని జగన్ ఆ లేఖలో గుర్తు చేశారు.
నా అంచనాలకు అనుగుణంగా 2.6 లక్షల మంది వలంటీర్లలో 99 శాతం మంది తాము చేస్తున్నది సేవ అని, అది ఉద్యోగం కాదని మనసావాచా కర్మణా నమ్మారు కాబట్టి ఈ వ్యవస్థకు మన సమాజంతోపాటు దేశంలో పలు రాష్ట్రాలు సలాం చేస్తున్నాయి. రెచ్చగొట్టే వారికి, ప్రలోభాలకు దూరంగా ఉండాలని ఓ అన్నలా, శ్రేయోభిలాషిలా విజ్ఞప్తి చేస్తున్నట్టు జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. వలంటీర్లుగా కాకుండా వేతనం కోసం పనిచేస్తే ఇప్పుడు మీకు లభిస్తున్న గౌరవం లభించి ఉండేదా? అని ప్రశ్నించారు. మీ సేవలకు అవార్డుగా, మీకు ఇవ్వవలసిన గౌరవాన్ని మీకు దక్కకుండా చేసేందుకు, వస్తున్న మంచి పేరును చెడగొట్టేందుకు ఎవరు కుట్రలు పన్నుతున్నారో తనకు తెలుసని అన్నారు.
తెలంగాణలో షర్మిల పార్టీ.. ప్రభావం ఎంత?!