Monday, April 29, 2024
- Advertisement -

తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ.. ప్ర‌భావం ఎంత‌?!

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సోద‌రి, దివంగ‌త మ‌హానేత వైఎస్సార్ త‌న‌య ష‌ర్మిల రాజకీయ రంగ ప్ర‌వేశంపై ఊహాగానాలు నిజ‌మ‌య్యాయి. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లో న‌ల్లొండ జిల్లాకు చెందిన వైఎస్సార్ అభినుమానుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆత్మీయ స‌మ్మేళ‌నంలో వారితో వివిధ అంశాల గురించి చ‌ర్చించారు. అంతేకాదు తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ స్థాపించే విష‌య‌మై కూడా స్ప‌ష్ట‌త‌నిచ్చారు. దీంతో సీఎం జ‌గ‌న్‌, ఆయ‌న చెల్లెలు ష‌ర్మిల మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయ‌నే విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌ని, అన్న మీద కోపంతోనే ఆమె ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని వైఎస్ కుటుంబ ప్ర‌త్య‌ర్థులు ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే ఈ విష‌యంపై స్పందించిన ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, సీఎం జ‌గ‌న్ స‌న్నిహితులు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి, ఇవి రాజ‌కీయ ప‌రంగా వచ్చిన అభిప్రాయ భేదాలు మాత్ర‌మేన‌ని, ఇరువురి మ‌ధ్య విభేదాలేవు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణలో పార్టీ పెట్టాల‌నే యోచన‌లో ష‌ర్మిల ఉన్నార‌ని, అయితే ఈ విష‌యానికి జ‌గ‌న్ పూర్తి వ్య‌తిరేకం అని తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే, ప‌క్క రాష్ట్రంతో స‌ఖ్య‌తగా ఉండాల‌ని భావిస్తార‌ని, అందుకే తెలంగాణ‌లో వైఎస్సార్ సీపీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంద‌ని పేర్కొన్నారు. ఈ ఒక్క కార‌ణంగానే రాజ‌కీయ‌ప‌రంగా చెల్లెలితో అభిప్రాయ భేదం త‌లెత్తిందని, అంతేత‌ప్ప అన్నాచెల్లెళ్ల మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు లేవని క్లారిటీ ఇచ్చారు.

ప్ర‌స్తుతం ష‌ర్మిల నిర్ణ‌యం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఓవైపు ఏపీలో తొలి విడ‌త పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌, స్వ‌యానా సీఎం చెల్లెలు, అన్న విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన రాజ‌న్న ముద్దుల త‌న‌య హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశం ఏ మ‌లుపు తీసుకుంటుందోన‌నే ఆస‌క్తి నెల‌కొంది. అయితే ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ, త‌నకు అన్న ఆశీస్సులు ఉన్నాయ‌ని,త్వ‌ర‌లోనే కొత్త రాజ‌కీయ పార్టీ పెడ‌తాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇక ఉమ్మ‌డి ఏపీలో గ‌తంలో విజ‌య‌శాంతి- త‌ల్లి తెలంగాణ పార్టీ, ల‌క్ష్మీ పార్వ‌తి- అన్న టీడీపీ నెల‌కొల్పిన విష‌యం తెలిసిందే. రాముల‌మ్మ త‌న పార్టీని టీఆర్ ఎస్‌లో విలీనం చేయ‌గా, అన్న టీడీపీ గురించి అంద‌రికీ తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల‌మ్మ పార్టీ ఎంత‌వ‌ర‌కు మ‌నుగ‌డ సాధించ‌గ‌ల‌దు అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ వంటి ఉద్య‌మ‌, ఉద్ధండ రాజ‌‌కీయ‌వేత్త‌ను ఆమె త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌రా, సీఎం అయిన అన్న జ‌గ‌న్తో విభేదాలు నిజ‌మే అయితే ఆయ‌న అండ లేకుండా ప‌క్క రాష్ట్రంలో ఎంత‌వ‌ర‌కు నెగ్గుకురాగ‌ల‌ర‌నే విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతోంది.

ఒక‌వేళ ష‌ర్మిల నిజంగానే పార్టీ పెట్టి ఎన్నిక‌ల్లో పోటీ చేసినా, వైఎస్సార్ అభిమానుల అండ‌తో కొద్దోగొప్పో సీట్లు గెలిచినా పార్టీని కొన‌సాగిస్తారా? లేదా ఆ మ‌ధ్య చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన‌ట్లు ఏదైనా జాతీయ పార్టీలో లేదా విభేదాలు స‌మ‌సి వైఎస్సార్ సీపీలోనే క‌లిపేస్తారా అని రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రికొంత మంది మాత్రం.. బీజేపీ ప్రాబ‌ల్యాన్ని త‌గ్గించడానికి, కాంగ్రెస్ పార్టీ బ‌లంగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని, రాజ‌కీయ నిరుద్యోగులను పార్టీలోకి తీసుకుని బీజేపీకి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌తోనే ష‌ర్మిల‌మ్మ తెలంగాణ‌లో అడుగుపెట్టారా అంటూ సోష‌ల్ మీడియాలో ఎవ‌రికి తోచిన తీరు వారు కామెంట్లు చేస్తున్న‌రు. మొత్తానికి తెలంగాణ‌లో, ఏపీలో ఇదే ప్ర‌స్తుతం ఉన్న హాట్‌టాపిక్‌!

Also Read : ఈటల మాటల వెనుక మర్మం ఇదేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -