ఆమె అయిదేళ్ళ క్రితం రాజకీయాలకు బాగా కొత్త. తొలిసారి ఎన్నికలల్లో పోటీ చేయడం, లక్కీగా ఉద్దండులనే ఓడించి పార్లమెంట్ మెంబర్ అయిపోవడం అలా జరిగిపోయింది. నాలుగున్నరేళ్ళ రాజకీయంలో ఎన్నో మలుపులు చూసిన ఆమె అనుభవం బాగానే గడించారు. ఇప్పుడు కొత్త పార్టీనీ స్థాపించారు.
కొత్త పల్లి గీత వైసీపీ నుంచి తొలిసారి పోటీ చేసి 2014 ఎన్నికల్లో అరకు ఎంపీ పదవి చేపట్టారు. ఆ తరువాత వెంటనే అధికార తెలుగుదేశం వైపుగా వెళ్ళిపోయారు. కొన్నాళ్ళు అలా ఉన్న తరువాత చంద్రబాబుని కూడా విమర్శించడం మొదలు పెట్టారు. ఈ మధ్యలో జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది. ఇక పార్లమెంట్లో అవిశ్వాసం సందర్భంగా ప్రధాని మోడీని వెనకేసుకురావడంతో ఆమె బీజేపీలో చేరుతారని భావించారు.
కానీ ఇంతలోనే ఏమయ్యిందో గాని ఏకంగా కొత్త పార్టీనీ స్థాపించారు. జనజాగృతి పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో గీత పార్టీ పేరు, జెండా, ఎజెండాను ప్రకటించారు. మార్పు కోసం ముందడగు నినాదంతో ఈ పార్టీని ప్రారంభించినట్లు ఆమె చెప్పారు.
చిహ్నంగా గొడును నిర్ణయించగా.. జెండా బులుగు, నీలం రంగులో ఉంది. ప్రజల కోసమే పార్టీలు పుట్టుకొస్తాయన్నారు ఎంపీ గీత. డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశానని.. నాలుగున్నరేళ్లుగా ఎంపీగా ఉన్నానన్నారు. పార్లమెంట్‌లో గిరిజన ప్రాంత ప్రజల సమస్యల్ని ప్రస్తావించానని గుర్తు చేశారు. ప్రజల సమస్యల్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా పార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
జనజాగృతి పార్టీలో మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇస్తామన్నారు గీత. అలాగే వెనుకబడిన కులాల వారికి, ఎస్సీ, ఎస్టీలకు కూడా ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. పార్టీలన్నీ మేనిఫెస్టో పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నాయని.. జనజాగృతి పార్టీ మాత్రం ప్రజలతో మమేకమై మేనిఫెస్టోను రూపొందిస్తుందన్నారు. మరి ఈమె వెంట ఎంతమంది నాయకులు నడుస్తారో చూడాలి.