కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు మంగళవారం(డిసెంబర్ 8) తలపెట్టిన భారత్ బంద్‌కు 24 రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, సమాజ్ వాదీ పార్టీ, శివసేన, శిరోమణి అకాలీదళ్, సీపీఐఎంఎల్, పీఏజీడీ(గుప్కర్ కూటమి), తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం, ఆప్, జేడీఎస్, బీఎస్పీ, పీడబ్ల్యూపీ, బీవీఏ, ఆర్ఎస్పీ, ఫార్వార్డ్ బ్లాక్, తదితర పార్టీలు మద్దతు ప్రకటించారు.

ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేటి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ నిర్వహించనున్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. రైతు సంఘాలతో ప్రభుత్వం రేపు మరోమారు చర్చలు జరపనుంది. కాగా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు దోచిపెట్టేందుకే తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.

అంబానీ, అదానీ వంటి కార్పొరేట్లకు అమ్మితే జవాబుదారీ ఎవరుంటారని ప్రశ్నించారు. ప్రస్తుతం కృత్రిమ కొరత సృష్టించకుండా నిత్యావసర సరుకులు స్టాక్ పెట్టుకోవడానికి వీలు లేకుండా చట్టం ఉండేదని, కొత్త చట్టం ద్వారా బడా వ్యాపారులు నిత్యావసర వస్తువులను స్టాక్ పెట్టుకునేలా వారికి లాభం చేకూర్చేలా ఉందన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఐదు దఫాలుగా కేంద్రం చర్చలు జరిపినప్పటికీ.. ఓ కొలిక్కి రాలేదు. మరోసారి డిసెంబర్ 9న రైతు సంఘాలతో కేంద్రమంత్రులు చర్చలు జరుపనున్నారు.

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేది లేదని కేంద్రం స్పష్టం చేస్తుంటే.. ఆ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాల ప్రతినిధులు పట్టుపడుతుండటంతో ఈ చర్చలు కొలిక్కిరాకుండానే ముగుస్తున్నాయి. మరి రేపటి చర్చల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో వేచి చూడాల్సిందే.


