ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు ప్రకంపనలు రేపుతోంది. తెలుగుదేశం పార్టీతో టీడీపీ జతకట్టడంపై ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ కాపులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి వట్టివసంత కుమార్ రాజీనామా చేయగా మరో సినియర్ నేత మాజీ మంత్రి సి. రామచంద్రయ్య పార్టీకి రాజీనామా చేస్తూ పొత్తుపై నిప్పులు చెరిగారు . టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఏఐసీసీ కనీసం పీసీసీని కూడా సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. కనీసం సీనియర్ లీడర్స్ ను కూడా సంప్రదించకుండా చంద్రబాబుతో పొత్తు ఎలా తేలుస్తారంటూ అధిష్టానాన్ని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామనీ, ఇందుకోసం టీడీపీతో జట్టుకట్టాల్సిన పనిలేదని వట్టి వసంతకుమార్, రామచంద్రయ్య సహా పలువురు నేతలు హైకమాండ్ కు తెలిపినా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా టీడీపీతో పొత్తు పెట్టు కొందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు తాము ఇప్పటికీ మరచిపోలేమన్నారు. విభజన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతీశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను భూస్థాపితం చెయ్యాలని, సోనియాను దేశం నుంచి తరిమెయ్యాలి ఇలా ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు.
రాహుల్ గాంధీ గుంటూరు జిల్లా వస్తే నల్లబ్యాడ్జీలతో టీడీపీ నిరసన ప్రదర్శనలు చేసిన విషయాన్ని తాము ఇంకా మరచిపోలేదన్నారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను తాము ఎందుకు సమర్థించాలని సి.రామచంద్రయ్య ప్రశ్నించారు. అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాపాలను తాము భుజాన వేసుకునే ఖర్మ పట్టలేదన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ బాబన్నారు. అందుకే పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.