ప్రజాసంకల్పయాత్రకు ప్రజాదరణ ఎప్పుడు తగ్గుతుంది? ఏ జిల్లాలో జగన్ ప్రభంజనానికి అడ్డుకట్టపడుతుంది? జనాలు లేని జగన్ పాదయాత్రను, జగన్ సభలను ఎప్పుడు చూడాలి? ఎప్పుడు ప్రచారం చేయాలి? ఇలాంటి అవకాశం కోసం జగన్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచీ కూడా చంద్రబాబుతో పాటు ఆయన భజన మీడియా కూడా వెయిటింగ్. కానీ కడప నుంచీ మొదలెడితే ఎక్కడా కూడా పచ్చ బ్యాచ్‌కి అలాంటి అవకాశం దొరకలేదు. రాయలసీమ విషయం పక్కనపెట్టినా కుల బలం ఎక్కువగా ఉన్న గుంటూరు, కృష్ణాల్లో జగన్ దెబ్బతింటాడనుకుంటే అక్కడ అంతకుమించి అనే స్థాయిలో ప్రజాదరణ కనిపించింది.
ఇప్పుడిక 2014లో జగన్‌ని అధికారానికి దూరం చేసిన గోదావరి జిల్లాల్లో అయినా జగన్ ప్రజాసంకల్పయాత్రకు ప్రజాదరణ తగ్గుతుందని టిడిపి జనాలు చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే మొదటి రోజు నుంచే పశ్ఛిమగోదావరి జిల్లాలో జన ప్రభంజనం కనిపించింది. వరుసగా నాయకుల చేరికలు కూడా టిడిపి పెద్దల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎఎంసీ మాజీ ఛైర్మన్ పిపిఎన్ చంద్రారావు జగన్ సమక్షంలో వైకాపాలో చేరారు. 2019 ఎన్నికల్లో వైకాపా గెలిచేవరకూ ప్రజల సమక్షంలోనే ఉంటానని శపథం చేశారు. గ్రౌండ్ లెవెల్‌లో అధ్యయనం చేశానని 2019 ఎన్నికల్లో పశ్ఛిమ గోదావరి జిల్లాలో వైకాపాకు మెజారిటీ సీట్లు ఖాయమని చంద్రారావు చెప్పారు. పరిస్థితులు……పరిణామాలు చూస్తుంటే మాత్రం గోదావరి జిల్లాల్లో కూడా ప్రజా సంకల్పయాత్ర సూపర్ సక్సెస్ అయ్యేలానే కనిపిస్తోంది. జగన్ పాదయాత్రకు ప్రజాదరణ లేదు, జగన్ సభలు అట్టర్ ఫ్లాప్ అన్న వార్తలు ప్రచారం చేయాలంటే టిడిపి నాయకులకు, ఆ పార్టీ భజన మీడియా జనాలకు ఇప్పట్లో అవకాశం దొరికేలా కనిపించడం లేదు.