Wednesday, May 22, 2024
- Advertisement -

వైఎస్ జగన్ కు మాజీ డీజీపీ ఝలక్

- Advertisement -

ఏపీ మాజీ డీజీపీ సాంబశివరావు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అలా ప్రకటించారో లేదో, ఇలా టీడీపీ అధినేత చంద్రబాబు సాంబశివరావుపై దృష్టి పెట్టారు. సాంబశివరావు వైఎస్ఆర్ సీపీ తరఫున ఒంగోలు ఎంపీ, లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వార్తలు కూడా వచ్చేశాయి. ఒంగోలు ఎంపీ స్థానానికి షర్మిల, వైవి సుబ్బారెడ్డి పోటీ పడతారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, సుబ్బారెడ్డి అద్దంకి ఎమ్మెల్యేగా పోటీ చేసి, షర్మిలకు ఒంగోలు ఎంపీ స్థానం ఇచ్చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే స్థానంపైనే ఆశలన్నీ పెట్టకున్న వైఎస్ఆర్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనవాస్ రెడ్డి సాంబశివరావు కోసం ఆ స్థానం త్యాగం చేసే పరిస్థితి లేదని ఆయన వర్గీయుల ద్వారా తేలిపోయింది. ఈ నేపథ్యంలో సాంబశివరావుకి ఆయన స్వస్థలమైన ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఏది ఇస్తారు ? అసలు జగన్ అలాంటి హామీ ఏమైనా ఇచ్చారా ? టికెట్ ఇచ్చినా కోట్ల రూపాయల ఖర్చు పెట్టుకునే స్థాయిలో సాంబశివరావు ఉన్నారా ? ఒంగోలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు రెండింటికీ జగన్ సోదరి షర్మిల, బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, మరో బంధువు బాలినేని శ్రీనివాస్ తీవ్రంగా పోటీపడుతున్న నేపథ్యంలో వారిని కాదని సాంబశివరావుకు జగన్ ఆ రెండు స్థానాల్లో ఏదో ఒకటి కేటాయిస్తారా ? అనే అనేక ప్రశ్నలు అటు ఖాకీల్లోనూ, ఇటు రాజకీయవర్గాల్లోనూ జరిగాయి.

ఈ చర్చలు ఇలా కొనసాగుతుండగానే అటు చంద్రబాబు నాయుడు సాంబశివరావుని దువ్వేశారు. అమరావతిలో ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ చర్చల్లో జగన్ ఇచ్చిన హామీ, ఎన్నికల్లో పోటీతో పాటు ప్రధానంగా ఎన్నికల ఖర్చు గురించే చర్చించినట్లు తెలిసింది. ఈ రోజుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయడమంటే మాటలు కాదని, నియోజకవర్గాల వారీగా ఖర్చు పెరుగుతూ ఉంటుందని చంద్రబాబు సాంబశివరావుకు చెప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం 20 నుంచి 70 కోట్ల వరకూ కొన్ని నియోజకవర్గాల్లో ఖర్చు అవుతోందని, ఎంపీగా గెలవాలంటే వంద కోట్లు అయినా వదలించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని బాబు సాంబశివరావుకు వివరించినట్లు తెలిసింది. అంత ఖర్చు చేసినా గెలుపుపై నమ్మకాలు ఉండట్లేదని చెప్పారు. ఈ విషయాలు మీకు తెలియనవి కావు. వాటన్నింటికీ సిద్దమేనా ? అంత ఖర్చు, రిస్క్ తట్టుకోగలరా ? అని బాబు ప్రశ్నించడంతో సాంబశివరావు, అంత ఖర్చు భరించే స్థాయి తనకు లేదని చెప్పారని తెలిసింది. దీంతో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి ఇస్తానని, కుదిరితే ఎన్నికలలోపే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సాంబశివరావు సంతోషం వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన సాంబశివరావు. ప్రస్తుతానికి చంద్రబాబుతో నామినేటెడ్ పదవిపై మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తాను జగన్ ను మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. ప్రతిపక్షనేత హోదాలో ఉన్నప్పుడు చంద్రబాబుని కూడా తాను విశాఖ సీపీ హోదాలో కలిశానని గుర్తు చేసుకున్నారు. జగన్ తో తన భేటీని వైఎస్ఆర్ సీపీ నేతలు, ముఖ్యంగా విజయసాయిరెడ్డి తప్పుగా అర్ధం చేసుకుని ఉండవచ్చని చెప్పారు. సమన్వయ లోపంతోనే తాను వైఎస్ఆర్సీపీలో చేరినట్లు ప్రకటించి ఉంటారని సాంబశివరావు చెప్పారు. ప్రజాసేవ చేయడానికి అనేక మార్గాలుండగా రాజకీయాలే అవసరమా ? అని ప్రశ్నించారు. కానీ నామినేటెడ్ పదవిపై స్పష్టమైన హామీ బాబు ఇవ్వడంతోనే ప్రజాసేవకు అనేక మార్గాలున్నాయని మాజీ డీడీపీ చెప్పారని తెలుస్తోంది. అయితే ఆ నామినేటెడ్ పదవి ఏంటి ? అనేదానిపై సమాచారం బయటకు రాలేదు. మొత్తానికి ఇలా వైఎస్ఆర్ సీపీలో చేరారో లేదో అలా టీడీపీ నేతలు సాంబశివరావుని ఎత్తుకుపోవడం, జగన్ కు బాబు ఇచ్చిన ఝలక్కేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇకనైనా పార్టీలో చేరేవారే విషయంలో జగన్ ఆయన అనుచరులు ఆచితూచి ప్రకటన చేస్తే వారికే మంచిదని, లేదంటే బాబు వారిని దువ్వేశాక, వైఎస్ఆర్ సీపీ పరువు పోవడం తప్ప ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -