Friday, May 17, 2024
- Advertisement -

రాజ‌కీయంలో ఆరితేరిన‌ చంద్ర‌బాబు, జ‌గ‌న్‌కే చుక్క‌లు క‌నిపించాయ్‌

- Advertisement -

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌మాద‌క‌ర‌మైన రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం చేస్తున్నాడు. త‌న జ‌న‌సేన పార్టీ ఏపీ, తెలంగాణ రెండు చోట్లా పోటీకి దిగుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఏపీలోని అన్నిస్థానాల్లోనూ బ‌రిలో దిగుతామ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లోనూ అన్ని స్థానాల్లో పోటీ చేయ‌నున్నామ‌ని, అయితే.. దీనిపై త్వ‌ర‌లోనే ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేస్తామంటూ వెళ్ల‌డించారు. అదే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొంప ముంచేలా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లోనూ రాజ‌కీయం చేయ‌డం అంత తేలికైన విష‌యం కాదు. రాజ‌కీయ ఉద్దండుడైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకే అది సాధ్యం కాలేదు. తెలంగాణ‌లో పార్టీని న‌డ‌ప‌డం అసాధ్య‌మ‌ని భావించే.. పూర్తిగా ఆశ‌లు వ‌దులుకుని.. కేవ‌లం ఆంధ్ర రాజ‌కీయాల‌పైనే బాబు దృష్టిసారించారిప్పుడు.

ఆంధ్ర‌లో కంటే తెలంగాణ‌లోనే తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు, నిబ‌ద్ధ‌త క‌లిగిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉండేవారు. తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్ పార్టీ అధికారం చేప‌ట్టినా.. వారికి క్షేత్ర‌స్థాయిలో ఓ మోస్త‌రు నాయ‌కులు కూడా లేరు. అందుకే.. ఆంధ్ర పార్టీల‌నే ముద్ర‌ను బ‌లంగా ప్ర‌చారం చేసి.. తెలుగుదేశం నేత‌లంద‌రినీ ఇంచుమించు ఊడ్చేసి.. త‌న పార్టీలో కేసీఆర్ చేర్చుకున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉందంటే.. ఉంద‌న్న‌ట్టుగా.. ఏదో ఒక‌రిద్ద‌రు నాయ‌కుల‌తో న‌డిపిస్తున్నారంతే. చంద్ర‌బాబు ప్రారంభంలో హైద‌రాబాద్‌లో కూర్చుని.. తెలంగాణ‌పై దృష్టిపెట్టినప్ప‌టికీ.. అక్క‌డ పుంజుకోక‌పోగా.. ఆంధ్రాలో క‌న్నం ప‌డుతోంద‌నే విష‌యం త్వ‌ర‌గానే గుర్తించారు. ఉన్న‌దీ పోయి.. కొత్త‌గా వచ్చేదేమీ ఉండ‌ద‌ని గ్ర‌హించాకే.. చంద్ర‌బాబు తెలంగాణ‌ను పూర్తిగా అక్క‌డున్న ఎల్‌.ర‌మ‌ణ లాంటి నాయ‌కుల‌కు అప్ప‌గించేసి.. వంద‌శాతం ఆంధ్ర‌పై దృష్టి పెట్టారు. చంద్ర‌బాబు కంటే మూడేళ్ల ముందే.. వైసీపీ అధినేత సైతం త‌న పార్టీని తెలంగాణ‌లో మూసేశారు. ఉన్న అర‌కొర నాయ‌కుల‌నూ తెరాస పార్టీ లాక్కోవ‌డంతో.. ఇంక అక్క‌డ ఉండి ప్ర‌యోజ‌నం లేద‌ని తెలిసి.. జ‌గ‌న్ పార్టీ తెలంగాణ‌లో జెండా పీకేసింది.

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంతొచ్చింది. చంద్ర‌బాబు, జ‌గ‌న్ మొద‌ట్లో చేసిన త‌ప్పునే ఇప్పుడు ప‌వ‌న్ చేస్తున్నాడు. త‌నకున్న కోట్లాది మంది తెలంగాణ ఫ్యాన్స్ అండ‌గా నిలుస్తార‌నే న‌మ్మ‌కం ఉందంటూ, అందుకే అక్క‌డా పూర్తిస్థాయిలో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌రిలోనికి దిగేందుకు ప‌వ‌న్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కానీ.. ప‌వ‌న్ ఈ రెండు ప‌డ‌వ‌ల సిద్ధాంతం ఎత్తుకుంటే.. అక్క‌డ ఎలాగూ నిల‌దొక్కుకునే అవ‌కాశం ఉండ‌దు.. కేసీఆర్ దృష్టిపెడితే నెల‌లో పూర్తిగా ప‌వ‌న్ పాపులారిటీని నేల‌మ‌ట్టం చేసేయ‌గ‌ల నేర్ప‌రి. ఏమాత్రం చ‌రిష్మా ఉన్న నాయ‌కుడు త‌న‌కు ఎదురొచ్చినా.. కేసీఆర్ చూస్తూ ఊరుకునే ర‌కం కాదు. వాళ్ల‌పై మొద‌ట వేసే ముద్ర‌.. ఆంధ్ర పార్టీ అనే.

ఈ ఒక్క మాట చాలు తెలంగాణ వాసుల్లో మ‌ళ్లీ సెంటిమెంట్‌ను ఉవ్వెత్తున ఎగిసేలా చేయ‌డానికి. మొన్నామ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణ‌లోని ఓ రెండు ప్రాంతాల్లో యాత్ర చేసే స‌రికే కేసీఆర్ పంచ్ డైలాగుల‌తో విరుచుకుప‌డ్డారు. అన్న‌ పీకిండు.. ఇప్పుడు త‌మ్ముడొచ్చిండంటూ.. త‌న‌దైన పంథాలో సెటైర్ల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గాలి తీసేశాడు. అందుకే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాస్త‌వాన్ని ఎంత తొంద‌ర‌గా గుర్తించి క‌ళ్లు తెరిస్తే.. అంత మంచిది. వృథా ప్ర‌యాస త‌ప్పుతుంది. ఆంధ్రాలో అంటే ప‌వ‌న్ పురిటిగ‌డ్డ కావ‌డంతో.. ఏమ‌న్నా.. ఏది చేసినా చెల్లుతుంది. అయినా.. రాజ‌కీయాల్లో ఆరితేరిన చంద్ర‌బాబుకే సాధ్యం కానిది.. ఇంక ప‌వ‌న్ వ‌ల్లేమ‌వుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -