ఏపీలో విపక్ష టీడీపీలో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే వరుసపెట్టి వికెట్ల మీద వికెట్లు పడుతూనే ఉన్నాయి. పార్టీకి భవిష్యత్తు లేదనె కారణంతో నేతలు పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ప్రధానంగా భాజాపా ఆపరేషన్ ఆకర్ష్‌కు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పదవులకు రాజీనామా చేసి పార్టీలోకి రావాలని జగన్ కండీషన్ పెట్టడంతో నేతలందరూ భాజాపా గూటికి చేరుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చె ఎన్నికల నాటికి బలపడాలని భాజాపా ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నేతలను పార్టీలో చేరేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే టీడీపీకీ చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రజా క్షేత్రంలో కనీసం వార్డు మెంబర్గా గెలిచే సత్తా లేని నేతలు కూడా… ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ఆ పార్టీలో కీలక నేతలుగా మారిపోతున్నారు.
తాజాగా వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో టీడీపీకీ బిగ్ షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన మాజీ మంత్రి ఎస్.రామమునిరెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో శనివారం హైదరాబాదులో బీజేపీలో చేరారు. ఆయన 1982లో ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పుడు ఆ పార్టీలో చేరి 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
30 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పనిచేస్తే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కనీసం తనను పట్టించుకోలేదని శశికుమార్ వాపోయారు. తన అన్న సి.రామచంద్రయ్యను కాదని తాను టీడీపీలో కొనసాగానని… పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తే తనను కనీసం గుర్తించలేదని ఆరోపించారు.
ఓబుళాపురం మైనింగ్ కేసులో జగన్‌ని అక్రమంగా ఇరికించేలా సీబీఐ అధికారుల వద్ద ఆయన పేరు చెప్పాలంటూ బాబు అప్పట్లో తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. కేసు విచారణలో జగన్ పేరు చెప్పలేదని అప్పటి నుంచి తనపై పార్టీ పెద్దలు కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని శశికుమార్ తెలిపారు. ఇప్పటికైనా టీడీపీ అధినేత తీరు మార్చుకోకపోతే రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని.. ఇప్పటికే చాలామంది పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారని శశికుమార్ బాంబు పేల్చారు. భాజాపాలో చేరేనేతలు ఇంకెంత మంది ఉన్నారో…?