Monday, May 6, 2024
- Advertisement -

తెలంగాణ నాయకుల బూతుపురాణం

- Advertisement -

దద్దమ్మలు, సన్నాసులు, గాడిద కొడుకులు అనే స్థాయి దాటేశారు. ఆ తిట్లు పాతవైపోయాయి. 2014 ఎన్నికలకు ముందు నుంచీ తిడుతున్న తిట్లు నాయకులకే కాదు జనాలకు కూడా బోర్ కొట్టేశాయి. అందుకే 2019 ఎన్నికల వేళ కొత్త తిట్లు అందుకోవాలి. తిట్లు తిట్టడంలో కొత్త రికార్డులు నెలకొల్పాలి. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాలి. ఎన్ని తిట్లు తిడితే అన్ని ఓట్లు. తిట్టడంలో ప్రత్యర్ధి స్థాయితో పాటు మన స్థాయి మరిచిపోవాలి. ఎంత వీలైతే అంత దిగజారిపోవాలి. వీలైనంత నాటుగా ఘాటుగా తిట్టాలి. మహిళలా ? మగవాళ్లా ? అన్నది కూడా పక్కన పెట్టేయాలి. ఒక్కో తిట్టు వింటుంటే చెవులకు విన”కంపు”గా ఉండాలి. మన తిట్ల పురాణం చూసి అవతలి వాళ్లు బూతుపురాణం మొదలు పెట్టాలి. మనం తిట్టే ప్రతి తిట్టూ మనల్ని ఒక మెట్టు కిందకి దించేయాలి. నువ్వు ఏం తిట్టావన్నది కాదు. ఎన్ని తిట్టావన్నదే ముఖ్యం.

ఏంటీ తిట్ల దండకం ? అని విసుక్కోకండి. ముందస్తు ఎన్నికల పుణ్యమా అని తెలంగాణలో వివిధ పార్టీల నేతల ఏకైక అస్త్రం ‘తిట్టు’. తామేమి చేశామో, ఏమి చేస్తామో చెప్పడం కంటే, తమకే ఎందుకు ఓటు వేయాలో వివరించడం కంటే ప్రత్యర్దులను ఎన్ని ఎక్కువ తిట్లు తిడితే అన్ని ఎక్కువ ఓట్లు పడతాయనే ఆలోచనలో ఉన్నట్టున్నారు తెలంగాణ ప్రాంత నాయకులు. మనమేంటి ? మన చదువేంటి ? సంస్కారం ఏంటి ? ఎదుటివారు ఎలాంటి వాళ్లు ? వాళ్ల స్థాయి ఏంటి ? అన్నదానితో సంబంధం లేదు. ఈ పార్టీ, ఆ పార్టీ, ఈ నాయకురాలు, ఆ నాయకుడు అని తేడా లేదు. ఎవరినోటికొచ్చినట్లు వాళ్లు, ఎవరికి ఎన్ని తిట్లు తెలిస్తే అన్ని తిట్లు చెడామడా తిట్టేసుకుంటున్నారు. బర్రెలు కాసేవాళ్లు కూడా ఇలా మాట్లాడరు అంటూనే వాళ్లు కూడా వాడటానికి ఇష్టపడని భాషలో తిట్టిపోసుకుంటున్నారు. ఈ విషయంలో ఆంధ్రాప్రాంత నాయకులు వెయ్యిరెట్లు బెటర్. హుందాతనంతో వ్యవహరిస్తుంటారు. ఏపీలోనూ సవాళ్లు ప్రతి సవాళ్లు ఉన్నా, ప్రత్యర్ధిని గౌరవిస్తూనే విమర్శిస్తారు. ఏక వచనంతో సంబోధించడమూ తక్కువే. మీరు గారు అంటూనే విమర్శలు గుప్పిస్తారు. అంతేకానీ నోటికొచ్చినట్లు మాట్లాడే నేతలు, సందర్భాలు చాలా చాలా తక్కువ.

కానీ తెలంగాణ నాయకులకు ఏమైందో ఏమో ? తమలపాకుతో నువ్వు ఒకటి అంటే తలుపు చెక్కతో నేను పది అంటా… అనే రీతిన రెచ్చిపోతున్నారు. జనం చూస్తున్నారు. యువత వింటున్నారు. భావితరాలకు, పిల్లలకు, టీవీ చూసే ఇంటిల్లపాదికీ ఎలాంటి సందేశం ఇస్తున్నాం. అనే జ్ఞానం ఏ ఒక్క పార్టీ నేతల్లోనూ కానరావట్లేదు. దొంగలు, ద్రోహులు, ఖబడ్దార్, అంతు చూస్తా. నీ బండారం బయట పెడతా, నీ వీడియోలు బయట పెడతా, వీపు మీద వాతలు పెడతా. దుర్మార్గుడు, జైలుకు పంపిస్తా, చిప్పకూడు తినిపిస్తా, కొడకళ్లారా జాగ్రత్త కాళ్లు పైకి చేతులు కిందకి వేలాడ దీస్తా. మీ అంతు తేలుస్తా. బట్టేబాజ్, బొడ్డులో కత్తులు పెట్టుకుని తిరుగుతుండ్రు. దొరికితే కసా కసా పొడిసి పారేస్తారు. ఎవడబ్బ జాగీరు.? నీ యబ్బ జాగీరా ? నీ ఆటలింక సాగవ్. మేమిక్కడ గాజులు తొడుక్కుని లేం. సిగ్గు శరం పౌరుషం లేవా ? దద్దమ్మలు, సన్నాసులు, గాడిదకొడుకులు, ఏం పీకినవ్ ? ఏం పీకుతవ్ ? పందికొక్కుల్లా మేసిండ్రు. బొక్కలు ఇరగ్గొడతం, కాంగ్రెస్ గొర్రెలు, దగాఖోర్‌, బాగోతంలో వేషగాళ్ల మాదిరి కత్తులు తిప్పారు. అసెంబ్లీకి ప్రిపేర్ కాకుండా పీకడానికి వచ్చారా ? సిగ్గు లేకుండా చేశారు. మహాకూటమి అలీబాబా 40 దొంగల గుంపుగా మారింది. మీది రాజకీయ వ్యభిచారం. కేసీఆర్‌ తీరు కల్లు తాగిన కోతికి తేలు కుడితే ఎలా ఉంటదో అలా ఉంది. ఓటమి భయంతో కేసీఆర్ మతి స్థిమితం కోల్పోయాడు. ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడు. పాలమూరుకు ఏం ఓరగబెట్టినవ్‌.. ఇంకా జుటాకోర్‌ మాటలు మాట్లాడుతావా? పూటకో పార్టీ మార్చినవ్‌ నీవు. దుబాయ్‌ శేఖర్‌గా పేరుపొందిన నీవు,. నా గురించి మాట్లాడుతావా? ముఖ్యమంత్రి స్థాయి మరిచి మాట్లాడుతావా? కేసీఆర్‌ ఖబర్దార్‌. బుడ్డర్‌ఖాన్లలాగా కత్తులు తిప్పిన్రు. ధోఖేబాజ్‌ అని నన్ను అంటారా ? మహాకూటమా.. గూటమా ?

తెలంగాణ నాయకుల తిట్లపురాణంలో ఇవి కొన్ని మాత్రమే. ఇలా చెప్పుకుంటూ, రాసుకుంటూ పోతే ఇంకో పది పది హేను పేజీలైనా చాలవు. వీళ్లా మన నాయకులు ? భావితరాలకు ఆదర్శనీయులు వీళ్లా ? అని బాధ పడటం తప్ప చేయగలిగిందేం లేదని యువత వీరిపై విమర్శలు గుప్పిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -