వేరే రుజువులేవీ అవసరం లేదు. మీడియా వాళ్ళంతా సర్వేలతో ఊదరగొట్టాల్సిన అవసరం లేదు. నాలుగేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనల్లో వచ్చిన వ్యత్యాసం ఏంటో కళ్ళకు కట్టే సందర్భం రానే వచ్చింది. 2019లో విజేత ఎవరు అనే చర్చోపచర్చలకు ఫుల్ స్టాప్ పెట్టే స్థాయిలో వరుస సంఘటనలు కళ్ళకు కడుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే రాజమండ్రి బ్రిడ్జ్‌పై వైఎస్ జగన్‌కి దక్కిన అపూర్వ స్వాగతం చూశాం. 2014 ఎన్నికల్లో వైకాపాను ఓడించిన జిల్లాలోనే జగన్‌కి కడపలో కూడా దక్కని స్థాయి ప్రజాదరణ దక్కింది. ఇప్పుడిక విశాఖపట్టణంలో వైఎస్ జగన్‌కి దక్కుతున్న ప్రజాదరణ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్‌సెట్ 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఏ స్థాయిలో మారిపోయిందో స్పష్టంగా తెలియచేస్తోంది.
2014 ఎన్నికల్లో స్వయానా వైఎస్ జగన్ తల్లి, వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను విశాఖ ఎంపి అభ్యర్థిగా పోటీ చేయించాడు జగన్. అయితే టిడిపి, బిజెపి జనాలందరూ కలిసి వైఎస్ విజయమ్మ గెలిస్తే విశాఖ వాసులు మొత్తాన్ని క్రిస్టియన్స్‌గా మార్చేస్తారు అన్న స్థాయిలో విషప్రచారం చేశారు. ఇక విశాఖ భూములను కడప గూండాలు లాక్కుంటారని, విశాఖలో రౌడీయిజం పెట్రేగుతుందని ఇష్టారీతిన ప్రచారం చేశారు. ఇక చివరి వరకూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి తరపున నిలబడతానన్న సబ్బంహరితో సహా నేతలందరూ కూడా చివరిక్షణంలో టిడిపి-బిజెపికి మద్దతునిచ్చేలా బేరసారాలు జరిపారు. వైఎస్ విజయమ్మ ఓడిపోయింది. అయితే నాలుగేళ్ళు తిరిగేసరికి ఇప్పుడు విశాఖలో జగన్‌కి దక్కిన ప్రజాదరణ చూసి వైకాపా జనాలే ఆశ్ఛర్యపోతున్న పరిస్థితి. విశాఖలోనే ఉంటూ అహర్నిశలూ కష్టపడుతున్న విజయసాయిరెడ్డి కృషి స్పష్టంగా కనిపించింది.
విశాఖనగరంతో పాటు పరిసర ప్రాంతాలన్నింటా జగన్‌కి దక్కుతున్న ప్రజాదరణను చూసి టిడిపి నాయకులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అందుకే మరోసారి జగన్‌పై అవినీతి ఆరోపణలు అంటూ రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే విశాఖలో జగన్‌కి దక్కిన ప్రజాదరణ వైకాపా శ్రేణుల్లో అమితోత్సాహాన్ని కలిగిస్తుంటే టిడిపి శిబిరంలో మాత్రం ఆందోళన పెంచుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ళలో మారిన ట్రెండ్స్ నేపథ్యంలో ఈ సారి విశాఖలో వైకాపా జెండా ఎగరడం ఖాయమని విశాఖలో ఉండే ఒక సీనియర్ నాయకుడు కూడా అభిప్రాయపడుతున్నాడు. సినిమా వాళ్ళతో సన్నిహితంగా ఉండే ఈ కళాపోషకుడైన నాయకుడు ఈ సారి విశాఖలో వైకాపాదే గెలుపని విశాఖ నాయకులతో ఘంటాపథంగా చెప్తూ ఉండడం పరిస్థితులను కళ్ళకు కడుతోంది.
