మెగా హీరోస్……క్రికెట్ టీంకి సరిపడినంత మంది ఉన్నారు. ఆ విషయాన్ని మెగా హీరోలే గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక నందమూరి, అక్కినేని వారసత్వ హీరోలకు కూడా లోటేమీ లేదు. వారసత్వంతో వస్తే హీరో అవ్వడం చాలా సులభం అన్నట్టుగా కంటికి కనిపిస్తుంది కానీ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ నొప్పులు కూడా మామూలుగా ఉండవు. పవన్, మహేష్ బాబు. ఎన్టీఆర్, చరణ్‌లకు వారసత్వం పుణ్యమా అని ప్రారంభ సిినిమాలకే గొప్ప క్రేజ్ వచ్చింది. కానీ ఆ తర్వాత మాత్రం ఆ వారసత్వమే పెద్ద గుదిబండ అయింది. అందరికంటే ముందుగా ఆ విషయాన్ని రియలైజ్ అయింది పవన్ కళ్యాణ్. చిరంజీవి నీడన ఉంటే తనకు భవిష్యత్తు లేదని తెలుసుకున్న పవన్ గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ సినిమాలతో తనకంటూ ప్రత్యేక శైలి క్రియేట్ చేసుకున్నాడు. మొదటి సినిమా అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయిలో చాలా సీన్స్‌లో చిరంజీవిని మక్కీకి మక్కీ కాపీ కొట్టిన పవన్ …….ఆ తర్వాత మళ్ళీ అలాంటి తప్పు ఎప్పుడూ చేయలేదు. ఇక మహేష్ బాబు కూడా ఒక్కడు లాంటి సినిమాతో తన ప్రత్యేకత నిరూపించుకుని పోకిరి తర్వాత నుంచీ మొత్తం ట్రెండ్ మార్చేశాడు. టెంపర్ సినిమా తర్వాత నుంచీ ఎన్టీఆర్ అయితే అసలు పూర్తిగా కొత్తగా కనిపించే ప్రయత్నంలో ఉన్నాడు. రామ్ చరణ్ కూడా వరుస ఫ్లాప్‌ల ఎఫెక్ట్‌తో ధృవ సినిమా నుంచీ కొత్త రూట్ పట్టాడు.
ఈ హీరోలందరూ కూడా అనుకరణలతో వారసత్వ నామాన్ని జపిస్తూ దెబ్బలు తిన్నవాళ్ళే. ఆ గుణపాఠాలు నేర్చుకున్నాకే సొంత శైలి ఏర్పర్చుకుని ప్రూవ్ చేసుకున్నారు. చిరంజీవిని అనుకరించి అటూ ఇటూ కాకుండా పోయిన తండ్రి నాగబాబు ఫెయిల్యూర్ స్టోరీ నుంచి పాఠాలు నేర్చుకున్నాడో ఏమో కానీ మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు, ఇమేజ్‌లాంటి వాటి జోలికి పోకుండా మొదటి సినిమా ముకుంద నుంచీ కూడా తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్నాడు. కంచె లాంటి మెమొరబుల్ ఫిల్మ్, ఫిదా లాంటి బ్లాక్ బస్టర్, ఇప్పుడు తొలిప్రేమతో మరో హిట్ కొట్టాడు.
అయితే వారసత్వ ఇమేజ్, చిరు, పవన్‌ల అనుకరణలతో రెండు ఇన్‌స్టెంట్ హిట్స్ కొట్టిన సాయిధరమ్ తేజ్‌ని మొదట్లో ఇండస్ట్రీ మొత్తం ఆకాశానికి ఎత్తేసింది. రామ్ చరణ్ తేజ్‌ని దాటేస్తాడు, అల్లు అర్జున్‌ని దాటేస్తాడు అని భజన చేసింది. వరుణ్ తేజ్‌ని మరీ తీసేసింది. కట్ చేస్తే తన ఒరిజినాలిటీ నిరూపించుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు నటుడిగా, స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. మెగా ట్యాగ్ అవసరం లేకుండా చేసుకున్నాడు. కానీ సాయి ధరమ్ తేజ్ మాత్రం అనుకరణలతో రేసులో పూర్తిగా వెనుకబడిపోయాడు. స్పూఫ్‌లు, అనుకరణలు, వారసత్వాలతో ఇన్‌స్టెంట్ హిట్స్ కొట్టొచ్చేమో కానీ వాటినే నమ్ముకుంటే మాత్రం నాలుగు సినిమాలతో చాప చుట్టేయాల్సిందే అన్న సత్యాన్ని సాయి కెరీర్ మరోసారి నిరూపించింది. రాబోయే వారసత్వ హీరోలకు కూడా ఇదే చాలా పెద్ద గుణపాఠం. ఇంటెలిజెంట్‌తో ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్ లాంటి సినిమాను ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ రియలైజ్ అవ్వాల్సిన టైం అయితే చాలా తక్కువ టైంలో వచ్చేసింది. కాస్త గ్యాప్ తీసుకుని అయినా మెగా పాట పాడకుండా, పవన్, చిరులను అనుకరించకుండా తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తే ఇప్పటికీ కూడా నిలదొక్కుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. డ్యాన్స్‌లు, బాడీలాంగ్వేజ్‌లో మాంచి ఎనర్జీ చూపించే సాయి ధరమ్ తేజ్ తనకంటూ సొంత యాక్టింగ్ శైలిని కూడా ఏర్పరుచుకోకుంటే ఇలాంటి ఇంటెలిజెంట్ డిజాస్టర్స్‌ని ముందు ముందు ఇంకా చాలా వాటినే ఫేస్ చేయాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు.
