రాజకీయాల్లోనే కాదు. పాలనలోనూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దూకుడు చూపిస్తున్నారు. ఆనం లాంటి సీనియర్ నేతలను చేర్చుకుంటూ పార్టీని బలోపేతం చేయడమే కాదు. రాజధాని అమరావతికి గుండె లాంటి విజయవాడను సంపూర్ణ అభివృద్ధి చేసేందుకు వీలైనంతగా ప్రయత్నిస్తున్నారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం రాకున్నా.. వీలైనంత వరకు ప్రాజెక్టులు, పనులను మోడీ సర్కార్ ఆధ్వర్యంలోనే ప్రారంభిస్తూ జనాల్లో క్రేజ్ పెంచుకుంటున్నారు.
విజయవాడలో బెంజి సర్కిల్ ఏరియాతో పాటు.. దుర్గమ్మ గుడి దగ్గర భారీ బ్రిడ్జ్ లు, ఫ్లై ఓవర్ లు ప్రారంభించిన కార్యక్రమమే బాబు దూకుడుకు మంచి ఎగ్జాంపుల్. కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాలను బాగా యూజ్ చేసుకుంటున్న ముఖ్యమంత్రి.. ఒకే సారి కేంద్ర మంత్రులు ముగ్గురిని విజయవాడ కార్యక్రమానికి రప్పించారు. అందులో సుజనా చౌదరి టీడీపీ నాయకుడైనా.. వెంకయ్యనాయుడు తెలుగు వారైనా సరే. ఈ ఇద్దరితో తనకేం సంబంధం లేదన్నట్టు.. కేంద్రమే ఈ బ్రిడ్జ్ ల ప్రారంభాన్ని ముందుండి నడిపిస్తోందన్నట్టు బాబు ఫోకస్ చేయగలిగారు. కేంద్రం వీలైనంతగా రాష్ట్రానికి సహాయం చేస్తోందన్న నమ్మకాన్ని ప్రజల్లో పెంచేందుకు ప్రయత్నించారు.
ఈ ఎఫెక్ట్ తో.. ప్రతిపక్షాలకు కూడా మాట రాకుండా పోయింది. మామూలుగా.. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాక.. రఘువీరారెడ్డి లాంటి ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేయడం కామన్. కానీ.. విజయవాడలో జరిగిన కార్యక్రమానికి సంబంధించి బడా నేతలెవరూ విమర్శలు చేయకపోవడం వెనక కూడా బాబు పక్కా ప్లానింగ్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే.. అమరావతి శంకుస్థాపనకు వైసీపీ అధినేత జగన్ రాని సందర్భం కూడా బాబుకే ఉపయోగపడింది. ఇకపై కూడా ఇలాగే.. అన్నీ తనకు అనుకూలంగా మలుచుకుంటూ బాబు గారు ప్లాన్ చేస్తున్నారట. అదీ సంగతి.