Friday, May 3, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో.. హైద‌రాబాద్ గ‌ల్లీ చిచ్చు

- Advertisement -

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 2 ప్ర‌స్తుతం వివాదాల్లో చిక్కుకునేలా క‌న్పిస్తోంది. బిగ్‌బాస్ సీజ‌న్ వ‌న్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ బిగ్‌బాస్‌ను రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు ఒకేలా ఆద‌రించారు. ఎలాంటి ప్రాంతీయ‌, కుల పొర‌పొచ్చాలు లేకుండా.. బిగ్‌బాస్ సాగింది. కానీ.. ప్ర‌స్తుతం బిగ్‌బాస్‌లోని ఓ కంటెస్టెంట్ వివాదాస్ప‌దంగా.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఉన్న సున్నిత‌మైన పొర‌ను త‌ట్టిలేపి.. ఓట్ల‌ను సంపాదించాల‌ని ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌లోని గ‌ల్లీల్లో ఉండేవారిని ఈ వివాదానికి కేంద్రంగా రోల్ రైడా అనే ఈ క‌టెస్టెంట్ ఎంచుకున్నాడు. పేరు కొంచెం విన‌డానికి విచిత్రంగా ఉన్న ఈ కంటెస్టెంట్ అస‌లు పేరు.. రాహుల్ కుమార్‌. ఇంజినీరింగ్ చ‌దివి కొన్నాళ్లు అక్క‌డా.. ఇక్క‌డా కొలువులు చేసి.. చివ‌రికి తెలుగులో త‌న రాప్ గీతాల‌తో స్థిర‌పడేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. బిగ్‌బాస్‌లో అవ‌కాశం రావ‌డంతో ఎగిరి గంతేసి.. వ‌చ్చి గ‌త 75 రోజులుగా హౌస్‌లో ఉంటున్నాడు. కానీ.. ఎప్పుడూ పెద్ద‌గా ఆక‌ట్టుకున్న‌ది లేదు. కానీ.. గ‌త రెండు వారాలుగా మాత్రం ఈ రాప‌ర్ వివాదాస్ప‌ద కామెంట్ల‌తో బిగ్‌బాస్‌కే ఎస‌రుపెట్టేలా మాట్లాడుతున్నాడు.

బిగ్‌బాస్‌లో తోటి కంటెస్టెంట్‌లు ఒక‌రిద్ద‌రు స‌ర‌దాగా మాట‌ల సంద‌ర్భంలో అప్పుడెప్పుడో రోల్‌రైడాను అన్న మాట‌ల‌ను ప‌ట్టుకుని.. హైద‌రాబాద్ గ‌ల్లీవోళ్లంటే మ‌జాక‌నుకుంటున్నారా.. అంటూ లేనిపోని హ‌డావుడి చేస్తున్నాడు. రోల్‌రైడా ఇలా అన్నాడో లేదో.. హైద‌రాబాద్ గ‌ల్లీవోళ్ల‌నే అంటారా.. గ‌ళ్లీవోళ్ల భాషంటే.. అంత లోకువా.. అంటూ ఇప్ప‌టికే.. కొన్ని టీవీఛానెళ్లు, వెబ్‌సైట్లు ఈ వివాదాన్ని పెంచేసే ప‌నిని భుజానికి ఎత్తుకున్నాయి. నిజానికి అస‌లు.. హౌస్‌లో ఉన్న వాళ్లు టాస్క్‌ల్లో భాగంగానో.. స‌ర‌దాగా మాట్లాడుతున్న‌ప్పుడో.. రోల్‌రైడాను నీ మాట‌లు కొంచెం క‌టువుగా తిట్టిన‌ట్టుగా ఉంటాయ‌ని అన్నారు. అది కేవ‌లం అత‌నిని వ్య‌క్తిగ‌తంగా.. అన్న మాట‌లు మాత్ర‌మే. కానీ.. రోల్‌రైడా వాటిని చిలువ‌లు ప‌లువ‌లు చేసేసి వివాదాన్ని రేపే ప‌నిని త‌ల‌కెత్తుకున్నాడు. విచిత్రంగా.. రోల్‌రైడా లేవ‌నెత్తిన వివాదానికి బిగ్‌బాస్ హోస్ట్‌గా ఉన్న నాని కూడా గ‌త శ‌నివారం మ‌ద్ద‌తు ఇచ్చేలా మాట్లాడ‌టంతో.. అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టయింది. నాని సైతం మ‌ద్ద‌తుగా మాట్లాడే స‌రికి రోల్‌రైడా దానికి కొన‌సాగింపుగా.. ఈ వార‌మంతా కేవ‌లం గ‌ల్లీవోళ్ల జ‌ప‌మే చేస్తూ.. చేతుల‌పై గ‌ల్లీ ప‌వ‌రంటూ గోరింటాకుతో పేర్లు సైతం రాసేసుకుని.. కెమెరాల ముందు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాడు. అస‌లే.. సున్నిత‌మైన అంశ‌మిది. ఇది చినికి చినికి ఎటు దారితీయ‌నుందో చూడాల్సిందే.

అస‌లు గ‌ల్లీల‌తో సంబంధం లేని వ్య‌క్తి..
వాస్త‌వంగా చూస్తే రోల్‌రైడా.. గ‌ల్లీవోళ్లంద‌రికీ తానే బ్రాండ్ అంబాసిడ‌ర్‌లా.. ప్ర‌చారం చేసుకునే స‌రికొత్త గేమ్‌ను ఆడుతున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. గ‌ల్లీవోళ్లంటే ఏమ‌నుకుంటున్నారంటూ.. గ‌ల్లీల‌న్నింటికీ తానే రాత్రికి రాత్రి లీడ‌రైపోయిన‌ట్టు హ‌డావుడి చేస్తున్నాడు. గ‌ల్లీవోళ్ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం మాట స‌రే.. అస‌లు గ‌ల్లీల‌తో ఏ సంబంధం లేకుండా.. హైక్లాస్ భ‌వంతుల్లో నివాసం ఉంటూ, ఖ‌రీదైన కార్లు, విదేశాల్లో రోల్‌రైడా చ‌క్క‌ర్లు కొడుతుంటాడు. గ‌ల్లీల్లో ఉండేవాడు కాదు.. గ‌ల్లీల్లో తిరిగేవాడూ కాదు. హైద‌రాబాద్ గ‌ల్లీలు, ప్రాంతాల‌పై ఓ నాలుగైదు ర్యాప్ సాంగ్‌ల‌ను ఆల‌పించి.. యూట్యూబ్‌లె పెట్టాడంతే. అవి కాస్తా సూప‌ర్‌హిట్ అయ్యాయి. ఇప్పుడు బిగ్‌బాస్‌లోనూ అదే మంత్రం వ‌ల్లించి.. ఓట్ల‌ను కొల్ల‌గొట్టి హిట్ట‌వ్వాల‌ని ప్ర‌యత్నం చేస్తున్నాడు. బిగ్‌బాస్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా ఎలాంటి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను రోల్‌రైడా ఇంత‌వ‌ర‌కూ సంపాదించుకోలేదు. అందుకే.. క‌నీసం తోటి కంటెస్టెంట్‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేసి.. గ‌ల్లీవోళ్ల‌ను వాళ్లు తిట్టారు.. నేను వాళ్ల‌ను తిట్టాననే కోణంలో క‌ల‌రింగ్ ఇచ్చి.. ఓట్ల‌ను దండుకునేందుకు వివాదం రేపే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. రోల్‌రైడా అనే ఈ కంటెస్టెంట్ మాట కొంచెం క‌ఠువుగా ఉంద‌ని, ప్ర‌తి విష‌యంలోనూ కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడ‌ని ఇత‌నిని హౌస్‌లోని ఎవ‌రో ఒక‌రు వ్య‌క్తిగ‌తంగా అంటే.. దానిని ఏకంగా గ‌ళ్లీవోళ్లంద‌రికీ ఆపాదించే ప్ర‌య‌త్నం చేయ‌డం క్ష‌మించ‌రానిది. ఒక వ్య‌క్తిని నీ మాట‌లు తిట్టేలా ఉంటాయంటే.. అది అత‌నికి సంబంధించిన మొత్తం జాతినో, ప్రాంతాన్నో, స‌మాజాన్నో, కులాన్నో అన్న‌ట్టు కాదు. అత‌ని వ్య‌క్తిగ‌త ప‌ద‌జాలం స‌రిగా లేద‌నేది అర్థం. ఎందుకంటే.. సమాజంలో ఏ జాతి, కులం, ప్రాంతం మాట‌లు తిట్టిన‌ట్టుగా ఉండ‌వు. ఒక వ్య‌క్తి మాట్లాడే విధానం బ‌ట్టి అవి మారుతుంటాయి. కానీ.. రోల్‌రైడా మాత్రం త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా అంటే.. దానిని స‌మాజానికి అంట‌గ‌ట్టేసి.. ల‌బ్ధిపొందాల‌ని చూస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

బిగ్‌బాస్‌కే ముప్పు తెచ్చేలా..
తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోలో.. ఆంధ్ర‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడుకు చెందిన వాళ్లు సైతం కంటెస్టెంట్‌లుగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఓ ప్రాంతానికి ముడిపెట్టేసి.. వాళ్ల‌కు తానే నిజ‌మైన ప్ర‌తినిధిన‌నేలా క‌ల‌రింగ్ ఇస్తూ బిగ్‌బాస్ రియాలిటీ షోకే ముప్పుతెచ్చేలా చేయ‌డం.. ఇబ్బందిక‌ర‌మే. త‌న ఒక్క‌డి స‌మ‌స్య‌ను ఒక జాతికో.. మ‌తానికో.. ప్రాంతానికో ఆపాదించేసి.. తోటి కంటెస్టెంట్‌ను, బిగ్‌బాస్ షోనూ బ్యాడ్ చేయాల‌ని చూడ‌డం అత్యంత హేయం. ఇద్ద‌రు మాట్లాడుకుంటే.. మాట‌ల సంద‌ర్భంలో వందనుకుంటారు. వాట‌న్నింటినీ.. చెప్పుకుంటూ పోతే.. కొట్టుకు చావాల్సిందే. ఇప్పుడు రోల్‌రైడా చేసింది కూడా అలాంటిదే. త‌న మాట‌లు తిట్టిన‌ట్టు ఉంటాయంటే.. దానిని ఏకంగా త‌మ గ‌ళ్లీ భాష‌నే అన్నాడంటూ.. ఎక్క‌డెక్కడికో ముడిపెట్టేశాడు. అంటే.. ఇప్పుడు హైద‌రాబాద్‌లోని గ‌ళ్లీల్లో ఉండే వారంతా.. క‌ట్ట‌క‌ట్టుకుని వ‌చ్చి.. త‌మ ప్ర‌తినిధి పిలుపిచ్చాడ‌ని.. బిగ్‌బాస్ హౌస్‌పై దాడి చేసి.. ధ్వంసం చేయాలా. ఇదేనా.. రోల్‌రైడా ఆలోచ‌న‌. ఇప్పుడు.. బిగ్‌బాస్‌లో ఇదే పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ వారం నాని వ‌చ్చి దీనికి ముగింపు ప‌లుకుతాడో.. మ‌రింత ఆజ్యంపోసి రెండు ప్రాంతాల‌కు ముడిపెట్టి నార‌ద పాత్ర పోషిస్తాడో చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -