మందుబాబులకు శుభవార్త. మందు తాగితే వాసన వస్తుందని ఇబ్బంది పడుతున్నారా..? ఇక నుంచి అలాంటి సమస్యలు ఉండవు. మందు తాగి ఇంటికెల్లినా భార్యలనుంచి చివాట్లు ఉండవు. తాజాగా మందుబాబులకు బయో మద్యం అందుబాటులోకి రానుంది.
అసలు విషయానికి వస్తే బీరు, విస్కీ, బ్రాందీ.. ఇలా మద్యం ఏదైనా ఓ రకమైన వాసన, రుచి ఉంటుంది. కాస్త డోసు ఎక్కువైతే ఇంకేముంది ప్రపంచం అంతా నాదే అంటారు. దీనికితోడు .. తలపోటు, వికారం దగ్గరి నుంచి ఒళ్లు నొప్పులు, మగతగా ఉండటం దాకా ఎన్నో సైడ్ ఎఫెక్టులు. ఇక నుంచి అలాంటి ఇబ్బందులు ఉండవు.
మందుబాబులకోసం త్వరలో రాష్ట్ర మార్కెట్లోకి రానున్న విదేశీ ‘బయో మద్యం’ఇలాంటి సైడ్ ఎఫెక్టులన్నింటికీ అతీతమట. వాసన కూడా రాకపోవడం దాని ప్రత్యేకత. దానికి కారనం మందుకు పలు రకాల ఔషధ ఉత్పత్తులను కలిపి దీనిని తయారు చేస్తున్నామని తయారీదారులు చెబుతున్నారు. తెలంగాణలో ఈ మద్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. అయితే ఈ బయో మద్యంలోనూ సాధారణ మద్యంలో ఉండే స్థాయిలోనే ఆల్కాహాల్ ఉంటుంది. వాసన రాకపోవడం, సైడ్ ఎఫెక్టులు లేకపోవడం తప్ప మిగతా అంతా సాధారణ మద్యం లాగానే ఉంటుంది. తాగేసి వాహనం నడిపితే ‘డ్రంకెన్ డ్రైవ్’లో దొరికిపోవడం ఖాయమే.
ఈ బయో మద్యాన్ని తయారు చేసింది తెలుగు వారే. గుంటూరుకు చెందిన సింధూరా హెర్బల్స్ సంస్థ వ్యవస్థాపకుడు అమర్నాథ్ బయో మద్యాన్ని తయారు చేశారు. దీనిని ఇక్కడి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని శాస్త్రీయపరమైన సందేహాలను నివృత్తి చేయలేకవటంతో… బయో మద్యం ఇక్కడి మార్కెట్లోకి రాలేదు. తరువాత ఈ బయో మద్యానికి విదేశీ హంగులు జోడించి అమెరికా, నేపాల్ మార్కెట్లలో ప్రవేశపెట్టారు. తాజాగా రాష్ట్రంలో విదేశీ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక్కడ మద్యానికి ఉన్న డిమాండ్‌పై సర్వే చేయించింది సదరు కంపెనీ. వాసన లేని, తలపట్టేయడం, వికారం వంటి సైడ్ ఎఫెక్టులు లేని మద్యానికి మంచి మార్కెట్ ఉన్నట్లు గుర్తించి.. తెలంగాణలో విక్రయాల కోసం కేఎస్ బయో నాచురల్స్ మార్కెటింగ్ సంస్థ పేరుతో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మద్యం తాగితే నిషా వస్తుందిగానీ.. తలపట్టడం వంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని, వాసన రాదని ఆ సంస్థ ప్రభుత్వానికి నివేదించి అనుమతి పొందింది. ప్రస్తుతం బయో బీరు, బయో విస్కీలకు అనుమతి వచ్చింది. త్వరలోనే బయో ఓడ్కా, బ్రాందీ, రమ్లను కూడా తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది.
మద్యానికి వాసన రాకుండా ఎలాంటివి కలుపుతారో తెలుసుకుందాం. ..
విదేశాల్లో మొక్కజొన్నలు, బార్లీ, జొన్నలు వంటి ధాన్యం ఆధారంగా తయారు చేసిన ఆల్కాహాల్ ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)కు చక్కెరను మండించి తయారు చేసిన ‘బరంట్ షుగర్’ను, ప్రత్యేక కృత్రిమ (సింథటిక్) ఫ్లేవర్లను కలిపి మద్యాన్ని తయారు చేస్తారు. అదే బయో మద్యంలో బరంట్ షుగర్ స్థానంలో తేనె ఆధారిత చక్కెరను, అశ్వగంధ లాంటి 16 రకాల మూలికలను కలిపి సహజ ఫ్లేవర్లతో మద్యాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇక మందు బాబులకు పండగే.
