ప్రపంచంలోని అతి గొప్ప ఉద్యమ నేతల పేర్లు రాస్తే అందులో ఫిడేల్ కాస్ట్రో పేరు ముందే ఉంటుంది. అగ్రరాజ్య శాడిజం – వారి మూర్ఖత్వానికి ఎదురు నిలిచి నిలబడ్డ నేత నిన్న రాత్రి కన్ను మూయడం తో ప్రపంచపు కమ్యునిస్ట్ వ్యవస్థ మొత్తం ఒక్కసారిగా మూగ బోయింది.
దాదాపు అర్రొందల యాభై సార్లు ఆయన మీద అమెరికా హత్యా ప్రయత్నం చేసినా కూడా అన్నిటి నుంచీ బయట పడిన వ్యక్తి ఆయన. కాస్ట్రో మన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కి ఇచ్చిన షాక్ గురించి ఆరోజుల్లో ఎక్కువగా చెప్పుకునే వారు. అలీనోద్యమం జోరుగా సాగుతున్న వేళ.. ఏడో అలీనోద్యమ సదస్సుకు వేదికగా ఢిల్లీ నిలిచింది. ఈ సదస్సుకు వందకు పైగా దేశాధినేతలు.. పరిశీలకులు హాజరయ్యారు. ఇలాంటి వేళ.. అప్పటివరకూ అలీనోద్యమానికి ఛైర్మన్ గా వ్యవహరించిన క్యాస్ట్రో.. తన తర్వాత అధ్యక్ష బాధ్యతల్ని ఇందిరకు అప్పగించాల్సి ఉంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యక్ష బాధ్యతల్ని తన సోదరికి అందించటం ఆనందంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా తన దగ్గర ఉన్న సుత్తి(అదేనండి కోర్టులలో జడ్జిల దగ్గర ఉంటుంది చూశారు కలప సుత్తి. అలాంటిదే)ని ఇందిరకు ఆయన ఇవ్వాల్సి ఉంటంది. దాన్ని అందుకునేందుకు వేదిక మీద ఉన్న ఇందిరమ్మ.. క్యాస్టో వద్దకు వెళ్లారు. చేయి జాచారు. కానీ.. క్యాస్ట్రో మాత్రం సుత్తి ఇవ్వలేదు. దీంతో.. సెకన్లు కాస్తా నిమిషాల మాదిరి భారంగా కదులుతున్నాయి. ఆ సందర్భంలో ఇందిరకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.
అలాంటి సమయంలో.. క్యాస్ట్రో చిరునవ్వుతో హటాత్తుగా ముందుకు కదిలిన ఆయన.. తన రెండు చేతులతో ఇందిరమ్మను గట్టిగా ఆలింగనం చేసుకోవటంతో ఆమె ఒక్కసారి షాక్ కి గురయ్యారు. వెంటనే తేరుకొని చిరునవ్వులు చిందించారు. ఆత్మీయ ఆలింగనం చేసుకున్న క్యాస్ట్రో.. అనంతరం తన సోదరికి ‘సుత్తి’ని ఇచ్చారు. దీంతో.. సదస్సు మొత్తం చప్పట్లో మారుమోగింది. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక ఉద్యమ నేత.. ఇందిరమ్మ విషయంలో వ్యవహరించిన వైఖరి అక్కడి వారినే కాదు.. అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. ఇందిరమ్మ సామర్థ్యం ఏమిటన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసేలా చేసింది.
