భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ నుండి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైన బంగ్లా ఇంటి ముఖం పట్టింది. 205 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్.. 32.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫఖర్ జమాన్ 74 బంతుల్లో 81, 7 సిక్సర్లు, 3 ఫోర్లతో రాణించగా అబ్దుల్లా షఫీఖ్ (68) రాణించారు. దీంతో పాక్ విజయం సునాయసమైంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ఫాంలోకి వచ్చారు ఫఖర్ జమాన్. బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ మూడు వికెట్లు తీశాడు.
ఇక అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మహ్ముదుల్లా (56), లిటన్ దాస్ (45), కెప్టెన్ షకీబ్ (43) రాణించగా.. తన్జీద్ (0), నజ్ముల్ (4), ముష్ఫికర్ (5), తౌహిద్ (7) విఫలమయ్యారు. దీంతో భారీ స్కోరు సాధించడంలో బంగ్లా విఫలమైంది. షాహీన్ షా అఫ్రిది, మహమ్మద్ వసీమ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఫఖర్ జమాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
వరుసగా నాలుగు ఓటముల తర్వాత పాక్ విజయాన్ని సొంతం చేసుకోగా ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింట్లో పరాజయాన్ని మూటగట్టుకుని బంగ్లా ఇంటి ముఖం పట్టింది. ఇక పాక్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి. ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో మూడింట్లో విజయం సాధించింది పాక్. మిగిలిన రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో భారీ విజయాలు సాధించడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంది.