టెస్ట్‌లకు ఎంపిక చేయకుండా రోహిత్‌కు మొండిచేయి చూపారు సెలక్టర్లు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ ఘోరంగా విఫలమయిన సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొనిజూన్ 14 నుంచి అఫ్గనిస్థాన్‌తో జరగనున్న ఏకైక టెస్టుకి సెలక్టర్లు అతడ్ని ఎంపిక చేయలేదు.
టెస్ట్‌కు ఎంపిక చేయపోవడంపై రోహిత్ శర్మ స్పందించారు. తనని ఎంపిక చేయకుండా సెలక్టర్లు పక్కన పెట్టడంపై తానేమీ బాధ పడటంలేదన్నారు. భారత జట్టులోకి 2010లో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మకి 2013లో టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కింది. కానీ.. ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో అంచనాల్ని అందుకోలేకపోయిన ఈ ఓపెనర్ ఇప్పటి వరకు ఆడింది 25 టెస్టులేకాగా.. ఇందులో 3 శతకాలు, 9 అర్ధశతకాలు మాత్రమే ఉన్నాయి.
క్రికెటర్ కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. నేను ఇప్పటికే సగం కెరీర్ పూర్తి చేసేశాను. ఇప్పుడు కూడా నేను భారత జట్టులోకి ఎంపికవుతానా..? తుది జట్టులో ఉంటానా..? అని ఆలోచించడం భావ్యం కాదన్నారు. ఒకవేళ సెలక్షన్ గురించి నేను ఎక్కువ ఆలోచించానంటే తప్పకుండా అది ఆటపై ప్రభావం చూపుతుంది. అలాకాకుండా ఆటని ఎంజాయ్ చేస్తూ.. నా వరకూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. 20 ఏళ్లప్పుడే భారత్ జట్టులో ఆడే అవకాశం దక్కింది. అరంగేట్రం చేసిన ఏడాదిలోనే టెస్టుల్లో కూడా ఛాన్స్ వచ్చిందని రోహిత్ వెల్లడించారు.