వన్డే ప్రపంచకప్‌లో గాడిన పడింది ఆస్ట్రేలియా. ఓటమితో ప్రపంచకప్‌ని ప్రారంభించిన ఆసీస్…తర్వాత పుంజుకుని హ్యాట్రిక్ విజయాలను నమోదుచేసింది. ఇక తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 309 పరుగులతో తిరుగులేని విక్టరీని సాధించి రేసులోకి వచ్చేసింది.
400 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 21 ఓవర్లలో కేవలం 90 పరుగులకు ఆలౌటై భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్ (25) టాప్ స్కోరర్ కాగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జాంపా 4, మిషెల్ మార్ష్ రెండు వికెట్లు తీశారు.
ఇక అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 44 బంతుల్లో 106 పరుగులు చేసి ఫామ్‌లోకి రాగా సిక్సర్లు, ఫోర్లతో నెదర్లాండ్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఇక ఓపెనర్ వార్నర్ సైతం బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో రాణించాడు. వార్నర్ 93 బంతుల్లో 3 సిక్స్‌లు, 11 ఫోర్లతో 104 పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ (71), లబుషేన్ 62 హాఫ్ సెంచరీలతో మెరిశారు. మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
వరల్డ్‌కప్‌లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద (309) జయం. ఇక ప్రపంచకప్‌లో అతి తక్కువ బంతుల్లో (40) సెంచరీ చేసిన ప్లేయర్‌గా మ్యాక్స్‌వెల్ రికార్డుల్లోకెక్కాడు.