కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో రైతు ఉద్యమం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్.. రైతు సంఘం నేతలకు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. రైతు సంఘం నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఖట్టర్ ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఖట్టర్ రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నిస్తున్నారని రైతు సంఘాల నేతలు అంటున్నారు. ప్రస్తుతం యూపీ గేట్ వద్ద రైతుల ఆందోళన సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ కార్యదర్శిగా ఎన్నికైన అమిత్ వాల్మీకి కి స్వాగతం పలికేందుకు బీజేపీ కార్యకర్తలు వెళ్లారు.
ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలకు .. రైతు సంఘం నేతలకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. ఘజియాబాద్ ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర ఘర్షణ జరిగింది. రైతు సంఘాల నేతలు తమపై దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో సీఎం ఖట్టర్.. రైతు సంఘాల నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. రైతు సంఘాల నేతలు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ‘ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి స్థాయి నేతలు కూడా ప్రజలతో కలవొద్దా? రైతు సంఘాల నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారు. రైతులంటే అందరికీ గౌరవం ఉంటుంది. కానీ కొందరు రైతులు ఆ గౌరవాన్ని పొగొట్టుకుంటున్నారు’ అంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు.
Also Read : పంజాబ్ వివాదం కొలిక్కి.. సిద్దూకు పీసీసీ..!